తనకు 25 ఏళ్ళే అని చెప్పి తండ్రి , కొడుకులని బోల్తా కొట్టించింది ఓ 51 ఏళ్ళ ఎన్.ఆర్.ఐ మహిళ. తాను ఆర్మీ బేస్‌లో పని చేస్తున్నట్లు నమ్మించి మరీ సింగపూర్‌లోని తండ్రీ, కొడుకుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకుంది.చేసిన తప్పులకు ఇప్పుడా మహిళ జైలులో ఊచలు లెక్కపెడుతూ భారీ మూల్యం చెల్లించుకుంటోంది.
51 సంవత్సరాల మలిహా రామ్ అనే మహిళ సింగపూర్‌లో నివాసం ఉంటోంది. కొన్నేళ్ల క్రితమే భర్తను పోగొట్టుకున్న ఈమె ఒంటరి జీవితాన్ని గడుపుతోందీ.డబ్బు పై ఉన్న వ్యామోహంతో అమాయకులను ట్రాప్ చేసి మోసం చేయడమే పనిగా పెట్టుకుంది మలిహా రామ్.దీనికోసం మ్యాట్రీమోనీ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుంది.అంతేకాదు కీర్తన అనే పేరుతో తమిళ మ్యాట్రీమోని వెబ్‌సైట్‌లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి..పెళ్ళి కోసం సంప్రదించిన వారిని బురిడీ కొట్టిస్తూ, అందినంతా వారి నుంచి నొక్కేస్తూ వచ్చింది.
ఈ క్రమంలోనే 2018లో భారత్‌కు చెందిన గోవిందధనశేఖర్ అనే వ్యక్తి మ్యాట్రీమోని వెబ్‌సైట్ ద్వారా ఆమెను సంప్రదించాడు. కాగా, గోవిందధనశేఖర్ తో మలిహా తాను ఆస్ట్రేలియాలోని ఆర్మీ బేస్ లో పని చేస్తున్నానని.. అక్కడ కాంట్రాక్ట్ ముగియగానే పెళ్లి చేసుకుందాం అని చెప్పి నమ్మబలికింది.అనుమానం రాకుండా కేవలం ఫోన్, చాట్ ద్వారానే సంభాషణలు జరిపి అతడి నుంచి భారీ మొత్తంలో డబ్బులు కాజేసింది.
సోషల్ వర్క్ కోసం డబ్బులు అవసరమని, త్వరలోనే తిరిగి ఇచ్చేస్తానని చెప్పి డిసెంబర్ 2018-అక్టోబర్ 2019 మధ్య కాలంలో పలుమార్లుగా గోవిందధనశేఖర్ నుంచి సుమారు 4,750 సింగపూర్ డాలర్లను తీసుకుంది.అంతేకాకుండా అతడి తండ్రి నుంచి కూడా సుమారు 1000 డాలర్లు నొక్కేసింది.
ఇక మలిహా రామ్ వద్ద గోవిందధనశేఖర్ ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా మాట దాటవేస్తూ ఉండటంతో అనుమానం వచ్చిన అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో మలిహా అసలు బండారం బయటపడటంతో పాటు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మలిహాకు ఈ విధమైన మోసాలు చేయడం కొత్తేమీ కాదు.. 2006-2007 మధ్య కూడా ఈమె ఇదే తరహా మోసాలకు పాల్పడి జైలు శిక్షను కూడా అనుభవించింది.దీంతో ఈ అంశం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసుపై విచారణ జరిపిన సింగపూర్ న్యాయస్థానం ఆమెకు ఏడు నెలల జైలు శిక్ష విధించింది.