విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. యన్టీఆర్ నటించిన కుటుంబ కథాచిత్రాల్లో చాలా ప్రత్యేకమైనది ‘కోడలు దిద్దిన కాపురం’. యన్.ఏ.టీ సంస్థ, రామకృష్ణ సినీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్ లో డి.యోగానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1970, అక్టోబర్ 21 న విడుదలై.. అఖండ విజయం సాధించింది. నేటికి సరిగ్గా ఈ సినిమా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సావిత్రి టైటిల్ రోల్ పోషించగా.. వాణీశ్రీ కథానాయికగా నటించింది. చిత్తూరు వి. నాగయ్య, జగ్గయ్య, సత్యనారాయణ, నాగభూషణం, సూర్యాకాంతం, విజయలలిత, కె.వి.చలం, పద్మనాభం, రావికొండలరావు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. టి.వి.రాజు సంగీత సారధ్యంలోని పాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. డి.వి.నరసరాజు సంభాషణలు ఆలోచింపచేస్తాయి.
కోటీశ్వరుడైన రావు బహుదూర్ కుటుంబంలో అశాంతి కరువవుతుంది. ఆయన భార్య భక్తి, పూజలు పునస్కారాలతో కాలక్షేపం చేస్తే.. పెద్ద కొడుకు భార్య ను ఒదిలిపెట్టి మరో అమ్మాయి మోజలో పడతాడు. కూతురు ధనమదంతో కట్టుకున్న భర్తతో కాపురానికి వెళ్ళకుండా పుట్టినిల్లులోనే తిష్టవేస్తుంది. దాంతో చిన్న కొడుకైన కథానాయకుడు తాగుడుకి బానిసై .. ఇంటి పరిస్థితికి బాధపడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో పెద్ద కోడలు ఇంటిని చక్కదిద్దే బాధ్యత తీసుకుంటుంది. వదిన మంచితనంతో మరిదిలో మార్పు వస్తుంది. కుటుంబాన్ని మార్చే పని ఇద్దరూ చేపడతారు. చివరికి రావు బహుదూర్ కుటుంబం మళ్ళీ సంతోషంతో కళకళలాడడమే మిగతా కథ.











