ఇంతకాలం జగన్ పాలనను చూసిన ప్రజలు ప్రస్తుతం వైసీపీ చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తమ శైలిని చూపిస్తున్నారు. తమను ఇంత వరకు పట్టించుకోని నాయకులు ఇప్పుడు వారి ఇళ్ల వద్దకు వస్తుంటే తమదైన రీతిలో సమాధానం ఇస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి రోజాకు ఒక పెద్దాయన ఊహించని షాక్ ఇచ్చాడు.
మంత్రిగా రోజా నియోజకవర్గ ప్రజలను కలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అనే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.అయితే సొంత నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు రోజాను సత్కరించారు.రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తమకు ఏం చేశారో చెప్పాలంటూ మహిళలు రోజాను నిలదీశారు. దీంతో రోజా అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఇక మరో ప్రాంతంలో తన పర్యటనను కొనసాగిస్తున్న మంత్రి రోజాకు ఒకచోట విచిత్రమైన అనుభవం ఎదురైంది. తనను కలిసిన ఓ వృద్ధుడిని నెలవారీ పింఛను అందుతుందా? అని రోజా ప్రశ్నించారు. అందుకతడు బదులివ్వకుండా తాను ఒంటరివాడనని, తనకెక్కడైనా పిల్లను చూడాలని వెటకరిస్తూ కోరాడు. ఆ ప్రశ్నకు అవాక్కైన మంత్రి ఒక్కసారిగా నవ్వేశారు. ఆమెతోపాటు చుట్టుపక్కల ఉన్నవారు కూడా నవ్వును ఆపుకోలేకపోయారు. పెద్దాయన ప్రశ్నకు రోజా బదులిస్తూ తాను పెన్షన్లు మాత్రమే అందేలా చూడగలనని, అమ్మాయిలను చూడడం తన పని కాదని స్పష్టంగా చెప్పేశారు. ఈ ఘటనతో అధికార వైసీపీ పై ప్రజల్లో నెలకొన్న అసహనం ఈ విధంగా బయటపెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఈ ఉదంతం పై రాజకీయ వర్గాలలో పెద్దఎత్తున చర్చ మొదలయ్యింది. ఇంతకాలం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఈరోజు రాజకీయాల కోసం అధికార పార్టీ నాయకులు ప్రజల్లోకి వస్తే ఇటువంటి సమాధానాలే వస్తాయని కొందరు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర, విద్యుత్ ఛార్జీలు, కుంటుపడిన అభివృద్ధి పై ప్రజల్లో తీవ్రమైన అసహనం నెలకొందని, ఈ నేపధ్యంలోనే తమ వద్దకు అధికార పార్టీ నాయకులు వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వ పాలన పై ప్రజలు ఈ రకంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో వకాపా నేతలు ఇలాంటి వింతలు మారెన్ని చూడాల్సి వస్తుందో వేచి చూడాలి.