ఏపీ ప్రభుత్వం పేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గ్రామాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం లే అవుట్లు వేసింది. అయితే తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. డిసెంబరు 25న పట్టాలు ఇవ్వదలచుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూనే.. గ్రామాల్లో ఒక్కొక్కరికి మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల భూమి ఇవ్వాలని లేఖలో కోరారు. ఎప్పుడో సంవత్సరం నుంచి పేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంటే నోరుమెదపని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తాజాగా లేఖ రాయడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
నిద్ర పోతున్నారా అన్నా..
సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆలోచన మంచిదే. అందరూ ఆహ్వానిస్తారు. అయితే సంవత్సరం క్రితమే ప్రభుత్వం పట్టణాల్లో సెంటు, పల్లెల్లో సెంటున్నర ఇవ్వాలని ప్రయత్నాలు ప్రారంభించింది. రూ.7 వేల కోట్లు ఖర్చుచేసి ప్రయివేటు భూములు కొనుగోలు చేసింది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు సీపీఐ రామకృష్ణ ఏం చేస్తున్నారు. అప్పుడే ముఖ్యమంత్రికి లేఖ రాస్తే ఎంతో బాగుండేది. పట్టణాల్లో కేవలం సెంటు భూమి ఇవ్వడం వల్ల మురికివాడల ఏర్పడతాయి కానీ కాలనీలు కాదని చెబితే పేదలు సంతోషించేవారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి, తీరా పట్టాలు ఇచ్చే సమయానికి కోమాలో నుంచి బయటకు వచ్చినట్టు సీఎంకు లేఖ రాయడం అనేక విమర్శలకు తావిస్తోంది.
ఇలా చెప్పారు బాగుంది
పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం కింద టిడ్కో ద్వారా గత ప్రభుత్వం పది లక్షల గృహాలు నిర్మించింది. 4 లక్షల ఇళ్లు నూరు శాతం పనులు పూర్తి చేశారు. మరికొన్ని 70 శాతం పూర్తయ్యాయి. ఎంతో మంది పేదలు ఇళ్ల కోసం డీడీలు తీశారు. అప్పులు తెచ్చి, అధిక వడ్డీలు చెల్లిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టిక్కో ఇళ్ల సంగతి వదిలేసింది. దాదాపు రూ.2000 కోట్లు చెల్లించిన పేదలు రోడ్డునపడ్డారు. వారికి ఉచితంగా ఇళ్లు కేటాయిస్తామని ఎన్నికల ప్రచారంలో అప్పటి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని, పేదలకు టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇవ్వాలని సీపీఐ రామకృష్ణ తాజాగా సీఎంకు లేఖ రాశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సంక్రాంతిలోగా ఇళ్లు కేటాయించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Must Read ;- నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్లకు రాజకీయ గ్రహణం…!











