సలార్ అంటే అర్థం తెలుసా?.. యోధుడు. ప్రభాస్ పోషించేది యోధుడైన యువకుడి పాత్రే. అందుకేనేమో యోధుడికి పాటలు పెట్టడం వృధా అని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావించినట్టుంది. ఈ సినిమాలో కేవలం రెండే పాటలుంటాయట. డిసెంబరు 1న ట్రైలర్, డిసెంబరు 22న సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారీ హైప్ తో విడుదలవుతున్న సినిమాగా సలార్ గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ సినిమాలోని పాటల మీద ఓ వార్త మాత్రం వైరల్ అవుతోంది. అదే ఐటమ్ సాంగ్. మొదట అసలు ఈ పాట కూడా అనుకోలేదట.
సినిమాకి హైప్ రావాలంటే ఈ పాట కావాలని భావించినట్టుంది. జైలర్ లో రజనీ, తమన్నాల మీద చిత్రీకరించిన నువ్వు కావాలయ్యా, నువ్వు రావాలయ్యా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. అందుకే ఇందులోనూ ఓ మసాలా సాంగ్ పెట్టాలని భావించి పెట్టేశారు. డర్టీ హరి గ్గామర్ డాల్ సిమ్రత్ కౌర్ మీద ఇటీవలే ఈ పాటను చిత్రీకరించారు. అయితే ఇందులోనూ ట్విస్ట్ ఏమిటంటే ఆమెతో కలిసి ప్రభాస్ స్టెప్పులు కూడా ఉండవట. ఈ పాట చిత్రీకరణ సమయంలో ప్రభాస్ విదేశాల్లో ఉన్నాడు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ రీరికార్డింగ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. ఇంతకుముందు కేజీఎఫ్ లోనూ పాటలు ఎక్కువగా లేవు.
ఇంట్రో సాంగ్, ఐటమ్ సాంగ్, అమ్మ పాటతో సరిపెట్టేశాడు. సాధారణంగా ఐటెంసాంగ్ లో హీరో, స్పెషల్ హీరోయిన్ చేసే రొమాన్స్ ఉంటేనే మజా ఉంటుంది. సిమ్రత్ అందాలతో రచ్చ చేస్తుంటే ప్రభాస్ హుక్ స్టెప్స్ వేస్తుంటే ఆయన అభిమానులు కేరింతలు కొట్టేవారు.అవి లేకపోవడం బ్యాడ్ న్యూసే కదా. ఇక ఈ సినిమాలో ఉన్న రెండు పాటల్లో ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్. ఇందులో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది.
పాటలు లేకపోతే ఆమె పాత్ర కూడా నామ్ కే వాస్తేలా మిగిలిపోతుంది. సినిమా విడుదల దగ్గరపడుతోంది కాబట్టి ప్రభాస్ కూడా ప్రమోషన్ కు సిద్ధమయ్యాడు. సినిమాలోని రెండు పాటల విడుదల ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇందులో ఇంకా మలయాళ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు, టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.