ఈ సెప్టెంబరులో గట్టి ఓటీటీ వార్ జరగబోతోంది. ఇటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కొన్ని కీలక సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి.
ఈ నెలలో విడుదలయ్యే వాటిలో నాచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’, నితిన్ నటించిన ‘మాస్ట్రో’ చిత్రాలు ఉన్నాయి. ఈ ఓటీటీ వార్ లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. చిన్న సినిమాలే కాదు కొన్ని పెద్ద సినిమాల విడుదలకు కూడా ఓటీటీ వేదిక కానుందని అర్థమవుతోంది. ముఖ్యంగా ఓటీటీ దిగ్గజాల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. దీన్ని తట్టుకునేందుకు భారీ మొత్తాలు చెల్లించి ఆయా సినిమాలను విడుదల చేస్తున్నాయి.
అసలు వీటిలో ఏ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో తెలుసుకోవాలంటే ఓ ప్రాథమిక అంచనాకు కూడా రావలసి ఉంటుంది. దానికి ఉన్న ఒకే ఒక మార్గం విడుదలైన ఆ సినిమా ట్రైలర్ ను ఎంతమంది చూశారన్నది. ఈ వ్యూస్ ను కూడా కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు. ఈ ట్రైలర్ చూసిన వారిలో ఎంతమంది లైక్ చేశారు? ఎంత మంది డిజ్ లైక్ చేశారన్న అంశం కూడా పరిగణనలోకి ఉంటుంది. ఈ సెప్టెంబరు నెలలో ఓ ఐదు సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. అవేమిటో చూద్దాం.
టక్ జగదీష్, మాస్ట్రో
నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన మిస్టర్ వి చిత్రాన్ని మొట్టమొదటి సారిగా ఓటీటీలో విడుదల చేశారు. మళ్లీ ఇంతకాలం తర్వాత ఈ వినాయక చవితికి ‘టక్ జగదీష్’ విడుదల కాబోతోంది. దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ నెల 10న విడుదలవుతోంది. దీని ట్రైలర్ ను 96 లక్షల మంది చూశారు. నిజానికి ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం నాని కి ఇష్టం లేదు. నితిన్ హీరోగా నటించిన ‘మాస్ట్రో’ చిత్రాన్నిఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేస్తున్నారు. హిందీ చిత్రం ‘అంధాదున్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. దీని ట్రైలర్ ను 1.3 కోట్ల మంది చూశారు. వారం రోజుల వ్యవధిలో ఈ రెండు తెలుగు చిత్రాలు ఓటీటీ ద్వారా ముందుకు రాబోతున్నాయి.
సంతానం ‘డిక్కీలూన’
సంతానం హీరోగా నటించిన డిక్కీ లూన కూడా ఓటీటీ ద్వారానే విడుదలవుతోంది. దీన్ని జీ5 సంస్థ స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ నెల 10 తేదీన దీన్ని విడుదల చేయనున్నారు. దీని ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది. 1.6 కోట్ల మంది ఈ ట్రైలర్ ను చూశారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కార్తీక్ యోగి దర్శకత్వం వహించారు. ఇందులో సంతానం మూడు విభిన్న తరహా పాత్రలను పోషించినట్టు చెబుతున్నారు.
విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్భార్’
విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘తుగ్లక్ దర్భార్ ’ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ నెల 11న విడుదలవుతోంది. హీరోయిన్ గా రాశి ఖన్నా నటించింది. ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాళ్ దీనికి దర్శకత్వం వహించారు. రెండు రోజుల క్రితం విడుదల చేసిన ట్రైలర్ కు 2.7 మిలియన్ వ్యూస్ లభించాయి.
సయీఫ్ ‘భూత్ పోలీస్’
పైన పేర్కొన్న చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే హిందీ చిత్రం ‘భూత్ పోలీస్’ ఇంకో ఎత్తు. సయీఫ్ అలీఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని డిస్నీప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ నెల 17న ఈ సినిమా విడుదల కాబోతోంది. 2.7 కోట్ల మంది దీని ట్రైలర్ ను చూశారు. ఒక్క సయీఫ్ మాత్రమే కాదు అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్, జావెద్ జాఫ్రీ లాంటి అగ్రతారాగణమంతా ఉన్నారు.
ఇది హారర్ కామెడీగా తెరకెక్కింది. మొత్తానికి ఈ ఐదు చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాయి. ఈ ట్రైలర్ల వీక్షణలను అధికారిక ఓటీటీ మాధ్యమాలలోని మాత్రమే ఇచ్చాము. నిర్మాణ సంస్థలు విడుదల చేసిన వాటిని లెక్కలోకి తీసుకోలేదు. ఓటీటీ సంస్థల పరంగా చూస్తే ఈ విషయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దూసుకుపోతోంది.
Must Read ;- కేజీఎఫ్ 2 చిత్రానికి రూ. 255 కోట్ల ఓటీటీ ఆఫర్?











