విశ్వక్ సేన్ హీరోగా లక్కీ మీడియా సంస్థ ‘పాగల్’ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకి దిల్ రాజు సమర్పకుడు. `ఫలక్నూమా దాస్`, `హిట్` చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉన్న విశ్వక్ సేన్ ఈ సినిమా గట్టి హోప్స్ పెట్టుకున్నారు. ఆ విషయాన్ని ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాటలు వింటే అర్థమవుతుంది. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన ప్రేమ్ (విశ్వక్సేన్) కథ ఇది. అమ్మ ప్రేమ అమ్మాయివల్లే సాధ్యం అనే అభిప్రాయానికి వస్తాడు. అమ్మలా చూసుకునే అమ్మాయి కోసం అన్వేషణ సాగిస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఎందరో అమ్మాయిలు తారసపడుతుంటారు. ఇలా అందరి వద్దా తన ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. అతను ప్రేమించిన అమ్మాయిల సంఖ్య 1600లకు చేరుతుంది.
ఎవరూ అతన్ని ప్రేమించడానికి ముందుకు రాని సమయంలో తీర (నివేదా పేతురాజ్) తారసపడుతుంది. అయితే అప్పటికే ఆమెకు పెళ్లి కుదురుతుంది. అందరి లాగానే అతని ప్రేమను తీర కూడా అంగీకరించదు. ప్రేమను కోరుకునే అతనికి ఎవరి ప్రేమా దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతాడు. చివరికి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. అమ్మ ప్రేమను పొందాలనుకునే అతని ప్రయత్నాలు ఏమయ్యాయి? ఆత్మహత్య చేసుకున్నాడా? అతని ప్రేమ ఏ తీరానికి చేరుకుంది? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ ప్రేమ పిచ్చివాడి జీవిత కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఇంతమందిని ప్రేమించడం కొత్త అంశమని దర్శకుడు భావించి ఉండొచ్చు. పైగా అతను కొత్త దర్శకుడు. ఎలాంటి కథ అయినా కథనంలో ప్రత్యేకత చూపినప్పుడే అతను రాణిస్తాడు. సినిమాలో ప్రధానంగా అదే లోపించింది. అమ్మ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనుకున్నారు. అమ్మే కాదు అమ్మాయి సెంటిమెంట్ కూడా పండలేదు. సినిమా ప్రథమార్థం ఫరవాలేదనిపించినా సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి గాడి తప్పింది. కామెడీకి పెద్ద పీట వేయాలనుకున్నారు. అందులోనూ టైమింగ్ లేదు. ఎమోషన్స్ విషయానికి వచ్చినా నిరాశే మిగులుతుంది.
చివరికి ఏ మోషన్ లేకుండానే కథ ముగుస్తుంది. హీరోగా విశ్వక్ సేన్ కు మంచి మార్కులే పడతాయిగానీ సినిమాలో దమ్ముంటే అవన్నీ ఎలివేట్ అయ్యేవి. ఇంతమంది అమ్మాయిలతో కథ నడపడం కూడా అంత ఈజీ కాదు. అందుకే హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యం లేకుండా పోయింది. హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ మెప్పించారు. అలాగే నరేష్, రాహుల్ రామకృష్ణ పాత్రలు కూడా బాగున్నాయి. నటుల పెర్ ఫార్మెన్స్ కన్నా కథనంలో ప్రత్యేకత ఉంటేనే సినిమా రక్తికడుతుంది. సంగీతానికి కూడా ఇందులో అంత రాణింపులేదు. పాటలు యావరేజ్. నేపథ్య సంగీతం బాగుంది. తల్లి ప్రేమకూ అమ్మాయి ప్రేమకూ ముడిపెట్టడం కూడా బాగోలేదు.
నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి, మేఘా లేఖ, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, నరేష్ తదితరులు
సాంకేతికవర్గం: సంగీతం: రధన్
నిర్మాత: బెక్కం వేణుగోపాల్, దిల్ రాజు
దర్శకత్వం: నరేష్ కుప్పిలి
ఒక్క మాటలో: పాగల్ ఎవరో?
విడుదల: 14-08-2021
రేటింగ్: 2/5