రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ ఎన్నికల ఫలితాలపై EVMల ట్యాంపరింగ్ నెపంతో అనుమానాలు రేకెత్తించిన పరకాల ప్రభాకర్ వంటి విశ్లేషకులకు సైతం కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఈవీఎంలలో మోసం జరిగిందని, అర్థరాత్రి వేళల్లో లక్షలాది ఓట్లు అదనంగా పోలయ్యాయంటూ ఆయన సుదీర్ఘకాలంగా చేస్తున్న వాదనలు, ప్రచారాలు ఈ బ్యాలెట్ ఫలితాలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డితో పాటు పరకాల ప్రభాకర్ తీవ్రంగా డిమాండ్ చేసిన పద్ధతిలోనే అంటే బ్యాలెట్ పేపర్లతోనే ఈ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈవీఎంల అవకతవకలు గానీ, సాంకేతిక మోసాలు గానీ జరగడానికి ఇక్కడ అస్సలు అవకాశమే లేదు. అయినప్పటికీ, ఫలితాల్లో ఎలాంటి మార్పూ లేదు అంతటా కూటమి హవానే స్పష్టంగా కనిపించింది. ప్రజలు ఈవీఎంల ద్వారా ఇచ్చినా, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఇచ్చినా తీర్పు ఒకేలా ఉంటుందని ఈ ఎన్నికలు నిరూపించాయి.
సొంత గడ్డ పులివెందుల మున్సిపాలిటీలోనే వైసీపీ ఘోర పరాజయం పాలుకావడం, జగన్ స్వయంగా ఓటు వేయకుండా వెనుదిరగడం వంటి పరిణామాలు ప్రజాదరణ ఎటువైపు ఉందో స్పష్టంచేశాయి. ఈవీఎంల వల్లనే 2024లో ఫలితాలు తేడా వచ్చాయని, అసలైన ప్రజాభిప్రాయం బ్యాలెట్‌లోనే బయటపడుతుందని వాదించిన పరకాల ప్రభాకర్‌కు ఈ ఫలితాలు సరైన సమాధానం చెప్పాయి. టెక్నాలజీని సాకుగా చూపి ప్రజాస్వామ్య తీర్పును తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఇక్కడ ఫెయిలైంది.
అంతేకాకుండా, మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ రాజధాని అంటూ తీసుకొచ్చిన కొత్త నినాదాన్ని కూడా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజలు తిరస్కరించారు. ఫలితంగా, ప్రజా తీర్పు వెనుక ఎలాంటి ఈవీఎం మాయాజాలం లేదని, ప్రజల ఆకాంక్షలు, అసంతృప్తులే ప్రధాన కారణమని తేలిపోయింది.
మొత్తానికి, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఈవీఎంల చుట్టూ అల్లిన కుట్ర సిద్ధాంతాలన్నింటినీ పటాపంచలు చేశాయి. సాంకేతికతపై నిందలు వేస్తూ ప్రజల నైతిక తీర్పును ప్రశ్నించిన పరకాల ప్రభాకర్ లాంటి విశ్లేషకుల పరువును ఈ స్థానిక ఎన్నికల ఫలితాలు తీసేశాయనే చెప్పాలి.











