కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది. దేశంలో ఒక్కొక్క దశలో మార్పులు చేసుకుంటూ కేంద్రం వస్తుంది. సడలింపులతో కూడిన అనుమతులనిస్తూ మార్గదర్శకాలను కేంద్రం రూపొందిస్తూ వస్తుంది. అన్‌లాక్-4.0లో భాగంగా రేపటి(సోమవారం) పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. పాఠశాలలు తెరిచేందుకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం అనుమతినిచ్చింది. అయితే కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం స్కూళ్లు తెరవాలా? వద్దా? అనే నిర్ణయం ఆయా రాష్ట్రాలకే వదిలేసింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం పాఠశాలు తెరిచేందుకు అనుమతిలేదు.
తల్లిదండ్రులు ఒప్పుకుంటెనే ఎంట్రీ…
తీవ్రమైన కరోనా పరిస్థితుల మధ్య మళ్లీ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే స్కూళ్లకు అనుమతి ఉంది. సోమవారం నుంచి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రాన్ని స్కూళ్లలో సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే విద్యార్థులకు స్కూళ్లకు ఎంట్రీ ఉండదట. కంటైన్మెంట్ జోన్లలో ఉండే విద్యార్థులు లేదా టీచర్లు ఎవరైనా సరే స్కూళ్లకు వెళ్లేందుకు అనుమతి లేదు. ఇప్పటికే తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమైన విషయం తెలిసిందే. తరగతి గదుల్లో శ్రద్ధగా పాఠాలు విన్నట్లుగా ఇళ్లల్లో కూర్చొని తమ పిల్లలు పాఠాలు వినడంలేదని పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. అయితే మనదగ్గర పూర్తిగా విద్యాసంస్థలు తెరుచుకుంటాయో లేదో చూడాలి. ఒకవేళ తెరుచుకున్నా కరోనా పరిస్థితుల మధ్య తమ పిల్లలను తల్లిదండ్రులు సూళ్లకు పంపిస్తారా? లేదా? అనేది చూడాలి మరీ.
నిబంధనలు తప్పనిసరి…
స్కూళ్లు తెరవబోయే వారు మాత్రం ఖచ్చితంగా కరోనా నివారణ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. సామాజిక దూరం, ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ధరించడం, చేతులను శానిటైజింగ్ చేసుకోవడం లాంటివి తప్పనిసరిగా పాటించాలి. స్కూళ్లలో ప్రవేశ ద్వారం దగ్గర తప్పనిసరిగా థర్మల్ స్కానర్లు, బాడీ టెంపరేచర్ చెక్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు స్కూళ్లలోకి ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. స్కూళ్లన్నీ వర్చువల్ క్లాసులను కొనసాగించాలని సూచించింది. ఇదిలా ఉంటే కొంత మంది పేరెంట్స్ అసలు ఈ విద్యాసంవత్సరానికి తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు సుముఖత చూపడంలేదు. విద్యా సంవత్సరం కోల్పోయినా పర్వాలేదు, పిల్లల ప్రాణాల కంటే ఎక్కువనా అని భావిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించింది. టిశాట్, దూరదర్శన్ లలో తరగతుల వారీగా ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. ఇక కొన్ని ప్రైవేట్ సూళ్లయితే రెండు మూడు నెలల నుంచే క్లాసులను ప్రారంభించేశారు కూడా. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కేంద్రం అన్ లాక్ 4.0లో భాగంగా 9 నుంచి 12 తరగతులకు అనుమతులివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకోనుంది.











