గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రజాకర్షక మేనిఫెస్టోలు విడుదల చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాము మేయర్ పీఠం ఎక్కితే ప్రజలకు ఏం చేస్తామో చెప్పేందుకు మేనిఫెస్టోనే బ్లూ ప్రింట్. దీంతో అత్యంత జాగ్రత్తగా పార్టీలు మేనిఫెస్టోను రూపొందిస్తాయి. ప్రచారంలో తిరిగి చెప్పడం కంటే పుస్తక రూపంలో ప్రజలకు అందజేస్తే పార్టీకి మైలేజీ పెరుగుతుందని భావిస్తుంటాయి. దీంతో ప్రజాకర్శక పథకాలను ప్రకటించి ప్రజలను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ విషయంలో పార్టీలో పోటీ పడి మరీ తాయిలాలు ప్రకటిస్తుంటాయి . గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ భవిష్యత్ ప్రణాళికలు ప్రజల ముందుంచుతున్నాయి.
టీఆర్ఎస్ ఉచితాల ఆఫర్..
మేనిఫెస్టోను విడుదల చేయడంలో అన్ని పార్టీల కంటే టీఆర్ఎస్ ముందుంది. తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను విడుదల చేసింది. గ్రేటర్ మేనిఫెస్టోలో పేదవర్గాలకు పెద్ద పీట వేసింది టీఆర్ఎస్ . ప్రధానంగా ఎంబీసీలకు భారీగా తాయిలాలు ప్రకటించింది. దోబీగాట్‌లకు, హెయిర్ కటింగ్ షాప్‌లకు ఉచితంగా కరంట్ ఇస్తామంటూ ప్రకటించింది. ఇక పేదవారికి ఆర్థిక భారం పడకుండా ఉచితంగా మంచి నీరు అందిస్తామని తెలిపింది. ఒక్కో కనెక్షన్‌కు 20వేల లీటర్ల మంచి నీరు అందజేస్తామని… పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయడంతో పాటు కొత్తగా మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చెపడతామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ప్రజలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని.. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు అండగా ఉండేలా కార్యచరణ సిద్ధం చేస్తామంటున్నారు.
టీఆర్ఎస్‌ను మించి పోయిన కాంగ్రెస్..
గ్రేటర్ ప్రజలకు ఇచ్చే తాయిలాల్లో కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. మంచి నీరు అందించే విషయంలో టీఆర్ఎస్ కంటే మరో 10వేల లీటర్లు ఎక్కువగా ఇస్తామది. 30వేల లీటర్ల మంచి నీరు.. వరద బాధితులకు 50వేల రూపాయల సాయం, మహిళలకు , వృద్దులకు, విద్యార్థులకు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తామంటున్నారు. ఇక వరదల్లో చనిపోయిన వారికి రూ.25లక్షల ఆర్థిక సాయం … ఇల్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి 5లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న వారికి 2.5లక్షల రూపాయలు ఇస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించింది. ఇక డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పి ఉన్న ఇళ్లను ఖాళీ చేయించిన వారికి రూ.60 వేలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
తన మేనిఫెస్టో చెప్పకనే చెప్పిన బీజేపీ..
ఇక బీజేపీ సంక్షేమ పథకాల విషయం పక్కన పెడితే యువకులను ఆకట్టుకునే అనేక తాయిలాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మేనిఫెస్టో విడుదల చేయక ముందే యువకులను తమ వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. పొరపాటున ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారి ఛలాన్లు జీహెచ్ఎంసీనే కడుతుందంటూ బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఇది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. హిందుత్వమే అజెండాగా సంజయ్ ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఆ వర్గాలను కూడా ఆకట్టుకునేందుకు తాయిలాలు ఉండబోతున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇళ్ల నిర్మాణం కూడా ప్రధాన అంశంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పేద, మధ్య తరగతి వారిని ఆకట్టుకునేలా ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్న మేనిఫెస్టోలను ప్రజలు ఏమేరకు ఆదరిస్తారు…గ్రేటర్‌లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో చూడాలి.