తెలుగు సినిమా కథను పరుగులు తీయించిన రచయితలలో పరుచూరి గోపాలకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. నటుడిగాను .. దర్శకుడిగాను ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. కొత్తగా వస్తున్న సినిమాలపైనే కాదు, టీవీ షోలపై కూడా ఆయన దృష్టి పెడుతుంటారు. అలాంటి పరుచూరి గోపాలకృష్ణ, తాజాగా ‘బిగ్ బాస్ 4‘ రియాలిటీ షోను గురించి ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో ప్రస్తావించారు.
“గతంలో ఎన్టీఆర్ .. నాని .. నాగార్జున హోస్టులుగా వ్యవహరించిన ‘బిగ్ బాస్‘ షోలను చూశాను. ‘బిగ్ బాస్ 4’ కోసం యూత్ ను దింపినట్టుగా నాకు అనిపించింది. విచిత్రమేమిటంటే ఈ హౌస్ నుంచి ఎవరు వెళ్లిపోతారనుకుంటే వాళ్లు వెళ్లడం లేదు .. ఎవరు వెళ్లరని అనుకుంటున్నామో వాళ్లు వెళ్లిపోతున్నారు. కరాటే కల్యాణి అద్భుతంగా బుర్రకథలు చెబుతుంది .. పాటలు .. పద్యాలు పాడుతుంది. హౌస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు గుక్క తిప్పుకోకుండా సూర్యవంశం గురించి చెప్పింది. హౌస్ లో ఇవన్నీ ఎందుకు చేయలేకపోయావమ్మా అని ఆమె బయటికి వచ్చాక అడిగాను.
టీవీ 9 దేవి కూడా చాలా రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందని అనుకున్నాను .. కానీ ఆమె కూడా వెళ్లిపోయింది.
ఇక చివరివరకూ తప్పనిసరిగా అమ్మ రాజశేఖర్ ఉంటాడని భావించాను .. ఆయన కూడా వెళ్లిపోయాడు. అలాగే ‘దివి’ .. మరికొందరు బయటికి వచ్చేశారు. ఇక షోలో ఏవుంటుంది? అనుకుంటూ ఉండగా, నవంబర్ 14న అందరికంటే అదిరిపోయే పెర్ఫార్మెన్స్ నాగార్జున చేశారు. 4 రోజుల పాటు సీక్రెట్ రూమ్ లో వున్న ‘అఖిల్‘ తిరిగి ఇంట్లోకి వెళతాడనే ప్రపంచమంతా అనుకుంటున్నప్పుడు, ”పెట్టె సర్దుకుని బయటికి వచ్చేయ్” అని నాగార్జున కోపంగా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు.
Must Read ;- అమ్మో.. అమ్మా.. హౌస్ మేట్స్ కు చుక్కలు చూపిస్తున్నాడు!
ఒక అబద్ధాన్ని నిజంగా చూపించగలగడం అద్భుతమైన నటులకే చెల్లుతుంది. నాగేశ్వరరావుగారి అబ్బాయి కనుక నాగార్జున కూడా అద్భుతంగా నటించాడు. ఆఖరి నిమిషం వరకూ అబద్ధాన్ని నిజంగా నమ్మించడం అంత తేలికైన విషయమేం కాదు. అఖిల్ హౌస్ లోనే ఉంటాడనే విషయం నాగార్జునకి తెలుసు. కానీ ఆ విషయాన్ని ఆయన తన కళ్లలో కనిపించనీయలేదు. ఆ సమయంలో ఆయన ఎక్స్ ప్రెషన్ లో చిన్న తేడా వచ్చినా ఆయన దొరికిపోయేవాడు. కానీ అలా దొరక్కుండా, అఖిల్ బయటికి వెళ్లిపోతాడనే అంతా అనుకునేలా నటించాడు. అందుకు నేను నాగార్జునను అభినందిస్తున్నాను.
‘అఖిల్’ను హౌస్ లో నుంచి బయటికి పంపిస్తున్నట్టు నాగార్జున చెప్పగానే, హౌస్ లో వున్న వాళ్లంతా అలా చేయవద్దంటూ దణ్ణాలు పెట్టేశారు. వాళ్లంతా రియల్ గా .. హార్ట్ ఫుల్ గా కన్నీళ్లతో వేడుకున్నారు. ‘అయ్యో అన్యాయంగా ఎలిమినేట్ చేసి పంపించేస్తున్నామా? ప్రేక్షకులు పంపించవలసింది .. మనమేంటి ఇలా చేశాం’ అంటూ అఖిల్ కోసం తాపత్రయపడ్డారు. హౌస్ లో ఉన్నవాళ్లందరి ముఖాల్లోను ఆ బాధ కనిపించింది. ‘బిగ్ బాస్ 4’ కి సంబంధించి ఈ ఎపిసోడ్ మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది” అని చెప్పుకొచ్చారు.
Also Read ;- ‘బిగ్ బాస్ 4’ కోసం మామ స్థానంలో కోడలు రానుందా..?











