పసుపు రాజకీయం మళ్లీ జోరందుకుంది. ఇందూరులో పసుపుబోర్డు ఏర్పాటుపై చర్చ తారాస్థాయికి చేరింది. ఎన్నికల సమయంలో అర్వింద్ చేసిన ప్రమాణం ఆయన మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది. బాండ్ పేపర్ రాసిచ్చి మరీ బరిలోకి దిగిన బీజేపీ.. అనూహ్యంగా గెలుపు సాధించింది. రాజకీయ దురంధరుడైన కేసీఆర్.. తనయపై విజయం కమలం పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చింది. కానీ.. అప్పటి విజయమే ఆ పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. కేంద్రంలో దిల్లీ రైతులు.. రాష్ట్రంలో ఇందూరు రైతులతో కాషాయ పార్టీకి నిద్ర కరవవుతోంది.
కొలిక్కిరాని చర్చలు…
పసుపు రైతుల ఆందోళనల నేపథ్యంలో వారితో అర్వింద్ చర్చించాలని నిర్ణయించారు. శనివారం నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లిలో ముఖాముఖి నిర్వహించారు. సుమారు నాలుగు గంటలపాటు వివిధ అంశాల గురించి మాట్లాడుకున్నారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత రైతుల కోసం చేసిన కృషి గురించి వివరించారు. కేంద్రంతో మాట్లాడి తెచ్చిన ప్రత్యేక నిధుల గురించి చెప్పారు. అయితే.. అర్వింద్ మాటలతో రైతులు ఏకీభవించలేదు. చివరికి చర్చలు కొలిక్కిరాకుండానే ముగిశాయి.
Must Read ;- కేంద్రం ఎత్తులు చిత్తు.. : ఢిల్లీని హడలెత్తించిన రైతులు
సగంలోనే వెళ్లిపోయిన అర్వింద్…
రైతులతో భేటీలో ఎంపీ అర్వింద్ తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. చర్చలు జరుగుతుండగానే.. ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు అర్వింద్. బోర్డుకు మించి రైతుల కోసం కృషి చేస్తున్నానని అర్వింద్ చెబితే.. బోర్డు, మద్దతు ధర తప్ప ఏదీ అక్కర్లేదని రైతులు తేల్చి చెప్పారు. ఆదినుంచి చివరి వరకూ అన్నదాతలకు సర్దిచెప్పేందుకు ఎంపీ ప్రయత్నించారు. చర్చల ప్రారంభం నుంచి.. చివరి వరకూ పసుపు బోర్డు గురించే రైతులు మాట్లాడారు. చివరికి విసిగిపోయిన అర్వింద్.. ‘నేను చెప్పేది నేను చెప్పా… ఇక మీ ఇష్టం’ అంటూ అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఐక్యత విచ్ఛిన్నానికి కుట్ర…
పసుపు రైతులు కొందరు శుక్రవారం.. జిల్లాలోని వేల్పూర్ ఎక్స్‌రోడ్డులో విలేకరులతో మాట్లాడారు. అర్వింద్‌తో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు రైతులు నిర్వహించే సమావేశంపై తీవ్ర అసంతృప్తి, అనుమానాలు వ్యక్తం చేశారు. పసుపు రైతుల ఐక్యతను విచ్ఛినం చేసేందుకే రైతులతో అర్వింద్ మీటింగ్ పెట్టారని ఆరోపించారు. రీజినల్ కార్యాలయం పసుపు బోర్డుకంటే ఉపయోగకరమైనదని చెబుతున్న అర్వింద్ అదే మాటతో రాజీనామా చేసి మళ్లీ ఓట్లడిగి గెలువాలని సవాల్ విసిరారు. అర్వింద్ తక్షణమే రాజీనామా చేయకపోతే అయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
అర్వింద్‌కు రైతుల డెడ్ లైన్…
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి.. ప్రాంతీయ బోర్డుతో సరిపెడతానంటే కుదరదని చెప్పారు. బోర్డు, మద్దతు ధర తప్ప ఇంకేమీ అక్కర్లేదని తేల్చి చెప్పారు. పదిరోజులు సమయం ఇస్తున్నామని, ఆలోపు పసుపు బోర్డు ప్రకటన రావాలని, లేదంటే… రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పదిరోజుల్లో స్పష్టమైన వైఖరి చెప్పకుంటే.. అడుగడుగునా అడ్డుకుంటామని చెప్పారు. భారీ ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Also Read ;- ఎర్రకోటపై రైతన్నల జెండా రెపరెపలు