(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
మరో ఏడాదిలోగా వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మంత్రి వర్గ ప్రక్షాళన జరగనుంది. ఈ క్రమంలో ఎవరు ఉంటారు? ఎవరిని తప్పిస్తారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ సాగుతోంది. అదే సమయంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సారి మంత్రివర్గంలో మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురు మహిళలు మంత్రులుగా ఉన్నారు. మేకతోటి సుచరిత, పుష్ప శ్రీవాణి, తానేటి వనిత మంత్రులుగా ఉన్నారు. అయితే వీరంతా రిజర్వుడ్ కేటగిరీకి చెందిన నాయకురాళ్లే. దీంతో ఈ దఫా మంత్రి వర్గ ప్రక్షాళనలో జనరల్ మహిళలు ఇద్దరి వరకు ఛాన్స్ దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శాంతికి అవకాశం
ఈ క్రమంలో పరిశీలిస్తే.. తొలి పేరు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిదేనని వైసీపీ సీనియర్లు చెబుతుండడం గమనార్హం. వాస్తవానికి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ పేరు తొలుత వినిపించినా.. ఎంపీ రంగయ్యతో ఆమెకు వివాదాలు ఏర్పడ్డాయి. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ వివాదాలు పెద్ద చిక్కుతెచ్చాయి. కొన్నాళ్లుగా ఆమె నియోజకవర్గంలోనే ఉండడం లేదని టాక్ ఉంది. దీంతో రెడ్డి శాంతి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె వివాద రహితంగా వ్యవహరించడం, పార్టీ పట్ల అంకితభావంతో ఉండడం వంటివి కలిసి వస్తున్నాయి.
‘శాంతి’పథం కలిసొచ్చేనా ..?
రాజకీయాల్లో వివాద రహితంగా ఉండడం, మౌనంగా వ్యవహరించడం ప్లస్ అవుతుంది. ఇలాంటి పరిణామమే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి కలిసి వస్తోందని అంటున్నారు పరిశీలకులు. వైసీపీ తరపున గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసిన శాంతి.. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయురాలు. పైగా వివాద రహితురాలు. ఎక్కడ ఎలా మాట్లాడాలో.. ఎవరిని కలుపుకొని పోవాలో.. ఆమెకు బాగా తెలుసు. ఎవరి కూటమిలోనూ ఆమె ఉండరు. తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వివాద రహితంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితులే.. రెడ్డి శాంతికి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నాయని శ్రీకాకుళం వైసీపీ నాయకులు చెబుతున్నారు.
జిల్లాలోని మిగిలిన నేతలను చూసుకుంటే.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం.. పార్టీని ఇబ్బందికర పరిణామాల్లోకి నెట్టడం కనిపిస్తోంది. పైగా ప్రజలకు అందుబాటులో కూడా ఉండడం లేదనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఇక శాంతి విషయానికి వస్తే.. ఆమె నియోజకవర్గం తప్ప బయటకు రావడం లేదు. ఏం చేసినా.. జగన్ పేరుతోనే చేస్తున్నారు. తన సొంత డబ్బా ఎక్కడా కొట్టుకోవడం లేదు. పైగా విజయసాయి రెడ్డి వంటి వారికి ఆమె ఎక్కడా వ్యతిరేకతగా వ్యవహారించకపోవడం కూడా కలిసి వస్తోందని చెబుతున్నారు. మొత్తానికి మంత్రి వర్గం కూర్పు మారితే.. రెడ్డి శాంతికి తప్పకుండా పదవి ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.











