ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుందామంటే కనీసం బెడ్డు దొరుకుతుందన్న భరోసా లేకుండా పోయింది. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లా సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కనేకల్లుకు చెందిన సుంకన్న అనే వృద్దడు కరోనా పాజిటివ్ తో ఆసుపత్రిలో చేరాడు. ఆక్సిజన్ పెట్టి వైద్యులు వెళ్లిపోయారు. కాసేపటికి ఆయన ప్రాణాలు విడిచారు. గంటలు గడచినా ఎవరూ పట్టించుకోలేదు. ఈలోపు మరో యువకుడు గాలిపీల్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉండటంతో బెడ్లు ఖాళీలేక అదే మంచంపై శవం పక్కనే పడుకోబెట్టి ఆక్సిజన్ తగిలించారు. ఇలాంటి ఘటనలు ఏపీ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయి.
రోజుకు ఒకసారి కూడా చూడరా…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులను రోజుకు ఒక్కసారి కూడా వైద్య సిబ్బంది చూడటం లేదని రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు నిండిపోవడం వైద్య సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. దీంతో వారు రోగులకు న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కరోనా మొదటి సారి వచ్చినప్పుడు తీసుకున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది. దీంతో వైద్యులు, నర్సులపై పని ఒత్తిడి పెరిగిపోయిందని తెలుస్తోంది. కనీసం తాత్కాలిక సిబ్బందిని తీసుకుందామన్నా గత ఏడాది పనిచేసిన వారికే జీతాలు ఇవ్వలేదు. దీంతో మరలా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పిలిచినా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వైద్యులు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం కరోనా రోగుల వైద్య సేవల విషయంలో చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది.











