గోదావరి జలాల సద్వినియోగంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం అద్భుత విజయాన్ని సాధించింది. నాడు చంద్రబాబు సర్కార్ దూరదృష్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు, కృష్ణా డెల్టా రైతులకు అండగా నిలవడమే కాకుండా రాయలసీమ ప్రాంతానికీ జలకళను తెచ్చింది. సముద్రంలో వృథాగా కలుస్తున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం దాదాపు రూ.1,651 కోట్ల అంచనా వ్యయంతో పట్టిసీమ డిజైన్‌ను రూపొందించి పూర్తి చేసింది. అత్యంత తక్కువ సమయంలో రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకోవడంతో ఈ ప్రాజెక్టు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ స్థానం సంపాదించుకుంది.
గడిచిన 12 ఏళ్ల వ్యవధిలో, 500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు విజయవంతంగా తరలించారు. చివరికి ఎల్‌నినో వంటి తీవ్ర అనావృష్టి సమయాల్లోనూ 57 టీఎంసీలకు పైగా గోదావరి నీటిని వాడుకోవడం ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను చాటిచెప్పింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగడమే కాకుండా, రైతన్నలకు, ఆక్వా రైతులకు తీవ్ర నీటికష్టాలు తప్పాయి.
సంవత్సరాల వారీగా నీటి వినియోగాన్ని పరిశీలిస్తే, 2017 లో అత్యధికంగా 161 రోజుల్లో 105.80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించారు. ఆ తర్వాత 2018 లో 165 రోజుల్లో 96.94 టీఎంసీలు, 2023 లో 119 రోజుల్లో 58.72 టీఎంసీలు, అలాగే 2026 లో 92 రోజుల్లో 57.70 టీఎంసీల నీటిని అత్యధికంగా సద్వినియోగం చేసుకున్నారు. తొలినాళ్లలో 2016 లో కూడా 134 రోజుల్లో 55.75 టీఎంసీల నీటిని తరలించి డెల్టా రక్షణలో పట్టిసీమ కీలక పాత్ర పోషించింది.
పట్టిసీమ ప్రాజెక్టు కేవలం సాగునీటికే కాకుండా ఆర్థికంగానూ అపారమైన ప్రయోజనాన్ని చేకూర్చింది. ఈ ప్రాజెక్టుపై పెట్టిన ప్రతి రూపాయికి 60 రెట్ల కంటే ఎక్కువగా, అంటే దాదాపు రూ.1 లక్ష కోట్లకు పైగా సంపద సృష్టి జరిగిందని సాగునీటి సంఘాలు చెబుతున్నాయి. ఇందులో వ్యవసాయ రంగం ద్వారా రూ. 26,775 కోట్లు, ఆక్వా రంగం ద్వారా రూ. 78,000 కోట్ల మేర సంపద చేకూరింది. అంతేకాకుండా, పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా నీటి అవసరాలు తీరడంతో శ్రీశైలంలో ఆదా అయిన కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు మళ్లించి అక్కడ పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధికి బాటలు వేశారు.
ప్రాజెక్ట్ ప్రారంభంలో నాటి వైసీపీ నేతలు పట్టిసీమను వట్టిసీమ అని ఎద్దేవా చేయడంతో పాటు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా పట్టిసీమపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించి నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టు సాధించిన జల విజయాలు మరియు ఆర్థిక ఫలితాలు ఆ విమర్శలన్నింటినీ పటాపంచలు చేశాయి. పట్టిసీమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మహత్తర జల విజయంగా నిలిచింది.











