తెలంగాణ బీజేపీ, జనసేన మధ్య వివాదం రచ్చకెక్కింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలనే పోటీ నుంచి తప్పుకున్నా కనీసం తెలంగాణ బీజేపీ నేతలు జనసేనకు కృతజ్ఙతలు కూడా చెప్పలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు తమను విస్మరించారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కుమార్తెకు మద్దతు పలికామని ఆయన స్పష్టం చేశారు. తాము కేంద్ర బీజేపీ నాయకత్వంతో కలసి పనిచేస్తున్నా తెలంగాణ రాష్ట్ర శాఖ తమను అవమానించిందని పవన్ మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేనను చులకన చేసే విధంగా బీజేపీ నేతలు మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహనీయుడని పవన్ గుర్తు చేశారు. అందుకే ఆయన కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు పలికామన్నారు.
పొత్తు ధర్మాన్ని విస్మరించారు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు ఖండించారు. గ్రేటర్ ఎన్నికలు అయిపోగానే జనసేనానికి కృతజ్ఙతలు తెలియజేశామని వారు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ పోలింగ్ రోజునే జనసేనాని టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలపడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని కేంద్ర బీజేపీ నేతల దృష్టికి తీసుకెళతామని తెలంగాణ బీజేపీ నేతలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మాన్ని విస్మరించారని తెలంగాణ బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు.
Must Read ;- మారుతున్న నేతల స్వరం.. బీజేపీ, జనసేన జట్టు కట్టేనా