‘నువ్వు బద్రి అయితే నేను నందా’ అంటూ సినిమాలో పవర్ స్టార్ ను కవ్వించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు నిజజీవితంలోనూ కవ్వింపు చర్యలకు దిగుతున్నారెందుకో అర్థంకావడం లేదు. పవన్ ను ఊసరవెల్లి అంటూ ప్రకాష్ రాజ్ కామెంట్ చేయడంపై పవన్ అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వీరిద్దరూ సినిమాల్లో ఒకరు హీరో అయితే ఇంకొకరు విలన్. సినిమాలతో పాటు జన జీవితాల్లోకి రావాలన్న తాపత్రయం ఇద్దరిలోనూ మెండుగా ఉంది. పవన్ కళ్యాణ్ తిక్క డైలాగ్ ప్రకాష్ రాజ్ కు వంటబట్టిందా అనుకోవాల్సి వస్తోంది.
ప్రకాష్ రాజ్ కామెంట్ల వెనకున్న లెక్క ఏమిటో చూడాల్సిందే. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ కామెంట్ చేయాల్సి వచ్చింది. ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు. ప్రకాష్ రాజ్ కు టీఆర్ఎస్ అంటే వీరాభిమానం. గతంలోనూ కేసీఆర్, కేటీఆర్ ల మీద తన అభిమానాన్ని చాటుకున్నారు కూడా. అందరూ టీఆరెస్స్ కే ఓటు వేయాలనడంలో తప్పులేదుగానీ నోరు పారేసుకోవడం మీదే అభ్యంతరం. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ వైఖరి ఆయనకు నచ్చటం లేనట్టుంది. అందుకే ఘాటు వ్యాఖ్యలు చేసేశారు.
ఒక పార్టీ నేత ఇంకో పార్టీకి మద్దతు ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పేమీ లేదు. కానీ ప్రకాష్ రాజ్ కు అందులో తప్పు కనిపించింది. పవన్ వైఖరి తనకు నచ్చటం లేదనడం వరకూ ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇన్ని సార్లు మాట మార్చడం చూస్తుంటే ఆయన ఊసరవెల్లి లా కనిపిస్తున్నారనడంతోనే వచ్చింది ఇబ్బంది అంతా. మాటిమాటికీ మాట మార్చడం వల్లే తను ఇలాంటి కామెంట్లు చెయ్యాల్సి వస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ తనను తాను నాయకుడిగా భావించడం లేదన్నారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Must Read ;- ‘వకీల్ సాబ్’ టీజర్ విషయంలో నిరాశచెందిన అభిమానులు