పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేకులకు కొత్తేమీ కాదు. అసలు ఆయన కెరీర్ బిల్డయిందే రీమేక్స్ మీద. వాటితో పోల్చుకుంటే.. ఆయన స్ట్రైట్ మూవీస్ చాలా తక్కువ. ఆల్రెడీ హిట్టైన కథలకు రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉండడం వల్లే చాలా మంది హీరోలు రీమేక్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అందులో పవర్ స్టార్ కూడా ఒకరు. ఒరిజినల్ వెర్షన్స్ లోని హీరోల పాత్రలను తనదైన స్టైల్లోకి మార్చుకొని వాటిని మరింత రక్తికట్టించడం పవర్ స్టార్ ప్రధాన బలం. ఆయన మ్యాజిక్ తో సూపర్ హిట్టైన రీమేక్స్ ఎన్నో. అందుకే ఆయన మరిన్ని రీమేక్స్ ను లైన్ లో పెట్టుకున్నారు.
కమ్ బ్యాకే ఒక రీమేక్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పవన్ టాలీవుడ్ లోకి కమ్ బ్యాక్ అవుతున్న సంగతి తెలిసిందే. మూడేళ్ళు సినిమాల్లో నటించకుండా.. అభిమానుల్ని నిరాశపరిచిన పవర్ స్టార్ .. ‘వకీల్ సాబ్’ తో వారిని మరింత ఖుషీ చేయబోతున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్టు మూవీ పింక్ కు రీమేక్ వెర్షన్ గా తెరకెక్కుతోన్న వకీల్ సాబ్ కు శ్రీరామ్ వేణు దర్శకుడు. కరోనా లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణను వాయిదా వేసుకున్న ఈ సినిమా… త్వరలోనే బ్యాలెన్స్ పార్ట్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం కాబోతోంది.
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్
ఈ ఏడాది మలయాళ ఇండస్డ్రీలో సంచలనం సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. సిన్సియర్ పోలీసాఫీర్ అయ్యప్పన్ కు, మాజీ హవాల్దార్ కోషికి మధ్య తలెత్తిన ఒక వివాదం .. ఇద్దరి ఇగోల్ని బాగా దెబ్బతీస్తుంది. అందుకే ఎవరికి వారు అవతలివారికి బుద్ధి చెప్పాలని ట్రై చేస్తుంటారు. ఈ గేమ్ లో చివరికి ఎవరు పై చేయి సాధిస్తారు అన్నదే మిగతా కథ. ఇందులో అయ్యప్పన్ గా బిజు మీనన్, కోషి గా పృధ్విరాజ్ అదరగొట్టేశారు. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ తీసుకున్నారు. హీరోగా ఇద్దరు ముగ్గురు హీరోల్ని అనుకున్నా.. చివరికి పవన్ తో ఈ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇందులోని మరో కేరక్టర్ కి హీరో ఇంకా ఎంపికవలేదు.
‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ లోనూ పవర్ స్టారే
లాస్టియర్ మలయాళంలో సంచలన విజయం సాధించిన థ్రిల్లర్ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’. పృధ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రను సురాజ్ వెంజారమూడ్ పోషించాడు. ఒక సూపర్ స్టార్ కి, అతడి వీరాభిమాని అయిన వెహికల్ ఇన్స్ పెక్టర్ కి మధ్య జరిగే ఇగో క్లాష్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ సొంతం చేసుకున్నట్టు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో సూపర్ స్టార్ పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తే .. సినిమా లుక్కే మారిపోతుందని రామ్ చరణ్ భావించాడట. అందుకే పవన్ కళ్యాణ్ ను ఇందులో హీరోగా నటించేందుకు ఒప్పించాడట. అతి త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ రాబోతోంది.
‘విక్రమ్ వేదా’ రీమేక్ లో పవన్ అండ్ రవితేజ ?
మూడేళ్ళ క్రితం తమిళంలో సూపర్ హిట్టైన యాక్షన్ మూవీ ‘విక్రమ్ వేదా’. విజయ్ సేతుపతి , మాధవన్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు గాయత్రి, పుష్కర్ దంపతులు దర్శకత్వం వహించారు. ఒక గ్యాంగ్ స్టర్ కి, ఓ పోలీసాఫసర్ కు మధ్య జరిగే టగ్ ఆఫ్ వార్ గా ఈ సినిమా తెరకెక్కింది. అప్పటి నుంచి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాలా మంది ట్రై చేశారు. కానీ హీరోల్ని ఎంపికచేయడం సమస్యగా మారింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం పవర్ స్టార్ ను, రవితేజను ఎంపికచేశారట. ఆ మేరకు ఆ ఇద్దరు హీరోలూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. మరి ఈ రీమేక్స్ పవర్ స్టార్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తాయో చూడాలి.