జనసేన నేత, తన సోదరుడు నాగబాబు విషయంలో పవన్ మనసు మార్చుకున్నారా.! కేబినెట్‌లోకి నాగబాబును వద్దనుకుంటున్నారా! అంటే అవుననే తెలుస్తోంది. తాజాగా నాగాబాబు పదవి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి వద్దని, కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.
నిజానికి నాగబాబును ఎమ్మెల్సీ చేసి కేబినెట్‌లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఇందుకు సంబంధించి గతంలోనే ప్రకటన కూడా చేశారు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి నాగబాబుకు కేటాయించాలని నిర్ణయించారు. ఐతే తీరా షెడ్యూలు వెలువడిన తర్వాత పవన్ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అయితేనే బాగుంటుందని చంద్రబాబు దగ్గర పవన్ తన అభిప్రాయం చెప్పినట్లు తెలుస్తోంది. పవన్ సూచన మేరకు నాగబాబుకు కీలకమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తూ.. పర్యావరణానికి దోహదం చేసే బాధ్యతలు ఉండే లాంటి కార్పొరేషన్‌కు ఆయన పేరు పరిశీలించే అవకాశముంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు నాగబాబు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. ఐతే కూటమి పార్టీల మధ్య సర్దుబాటు కారణంగా తన పార్లమెంట్ సీటును త్యాగం చేశారు నాగబాబు. ఈ నేపథ్యంలోనే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని భావించారు చంద్రబాబు. మధ్యలో రాజ్యసభకు వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అయితేనే బాగుంటుందన్న పవన్ అభిప్రాయంతో కార్పొరేషన్ పదవి ఇస్తారని తెలుస్తోంది.
జనసేనకి ప్రస్తుత కేబినెట్‌లో మూడు మంత్రి పదవులు దక్కాయి. వాటిలో రెండు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోపాటు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ .. అదే సామాజిక వర్గానికి చెందిన వారు.. అదే సామాజిక వర్గానికి చెందిన నాగబాబుకి కూడా మంత్రి పదవి ఇస్తే, పార్టీపై కాపు ముద్ర పడుతుందని భావించిన పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది.. నాగబాబుకి మంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగిన సమయంలో అది జనసేన కాదు.. కాపు సేన, కుల సేన అని విమర్శలు చేశారు.. దీంతో, అన్ని వర్గాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఆయన వెనక్కి తగ్గారని తెలుస్తోంది.. దీనిపై చంద్రబాబుతో మంతనాలు జరిపిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.. అందుకే, అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్ ఉంటుంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన విజేత అని.. పవన్ అదే బాటలో వెళుతున్నారా..?