జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై సర్వత్రాచర్చ నడిచింది. బుధవారం పవన్ మీడియాతో మాట్లాడాక క్లారిటీ వచ్చింది. అయితే పవన్ ఢిల్లీటూర్ సక్సెస్ అయిందా.. ఫెయిల్యూర్ అయిందా అనే అంశంతోపాటు టైమింగ్ పైనా సోషల్ మీడియాలో, ఇతర పార్టీల్లో చర్చ లు నడుస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఫెయిల్యూర్ అని చెప్పడం పెద్ద ఆశ్చర్యం కలిగించే అంశం కాదు.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో GHMC, తిరుపతి ఉప ఎన్నిక తప్ప.. పెద్దగా బీజేపీకి ప్రతిష్టాత్మక ఎన్నికలు ఏపీలో లేవు. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడనే విషయం ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ టూర్ కి వెళ్లడం, పార్టీ పెద్దలని కలవడం వెనుక దీర్ఘకాలిక వ్యూహమే కనిపిస్తోంది.
పవన్ ఢిల్లీ టూర్ ఓటు బ్యాంకు, సీటుకోసమే పరిమితమైనట్లు కనిపించడం లేదు. 2019లో పార్టీ నిరాశాజనకమైన ఫలితాలు సాధించినా, పార్టీ ని నడపడం కష్టమనే విశ్లేషణలు వస్తున్నా.. మళ్లీ తన పార్టీ శ్రేణుల్లో ఎప్పటికప్పుడు ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు పవన్. ఇక్కడే GHMC ఎన్నికల విషయాన్ని ప్రస్తావించవచ్చు. వాస్తవానికి GHMC ఎన్నికల్లో జనసేన ఎన్ని గెలుస్తుందనే విషయం పక్కన బెడితే.. ఆ పార్టీకి చెందిన 50 మంది నామినేషన్లు వేశారు. ప్రతి ఓటు కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండే సెటిలర్ల ఓట్లు.. జనసేన లాగేసుకుంటుందనే టెన్షన్ అటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో కనిపించింది. చర్చల తరువాత జనసేన బీజేపీకి మద్దతు ప్రకటించింది. ఇతర పార్టీలకు సానుభూతిపరులుగా ఉండే సెటిలర్లు మినహా జనసేన, పవన్ అభిమానులు, ఆ సామాజిక వర్గానికి చెందినవారి ఓట్లు సింహభాగం తమకే పడతాయని బీజేపీ అంచనావేసింది. అది బీజేపీకి లాభం కాగా.. మిత్ర ధర్మం కోసం జనసేన త్యాగం చేసిందనే అభిప్రాయం జనసేన శ్రేణుల్లో కలిగించారు.
ఇక పవన్ ఢిల్లీ టూర్ విషయంపై మరో అభిప్రాయం కూడా వ్యక్తమైంది. పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లినా అపాయింట్ మెంట్ దొరకలేదని, జాప్యం జరిగిందని ప్రచారం జరిగింది. జాప్యం జరిగిన విషయం వాస్తవమే కావచ్చు. అందుకు కారణం కూడా ఉంది. ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయపార్టీల ముఖ్యనేతలు సడెన్ గా జాతీయ పార్టీలతో మాట్లాడేందుకు వచ్చినప్పుడు అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయపార్టీలు కాస్త సమయం తీసుకుంటాయి. తమకు కలిసేందుకు వచ్చిన ప్రాంతీయ పార్టీ తాజా పరిస్థితి ఏంటి, సదరు రాష్ట్రంలో ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య విషయాలు ఏమున్నాయని, ఏ అంశాలపై హామీ ఇవ్వచ్చు.. వేటిని వాయిదా వేయచ్చు.. అనే విషయంలో ఓ అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఇలాంటి ఘనటలు గతంలో కేంద్రంలో UPA1,UPA2, NDA1, నేషనల్ ఫ్రంట్, అధికారంలో ఉన్న టైంలోనూ చోటుచేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ నేతలు, పార్టీల ప్రతినిధులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అక్కడ రోజుల తరబడి వెయిట్ చేసిన సందర్భాలున్నాయి. గతంలో 2004లో టీడీపీ అధికారం కోల్పోయిన సందర్భంలో.. ఆ పార్టీకి చెందిన వేణుగోపాలచారి, కంభంపాటిలాంటి లీడర్లు నెలల తరబడి జాతీయ పార్టీలు, NCP, TMC, SP, BSP లాంటి పెద్ద పార్టీల ముఖ్యనేతల అపాయింట్ మెంట్ల కోసం ఎదురుచూసిన సందర్భాలూ ఉన్నాయి. రాజకీయాల్లో అది సహజంగా జరిగేదే కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే వాదనలూ ఉన్నాయి.
Must Read ;- తిరుపతి ఎంపీ టిక్కెట్ గురుమూర్తికే!
తిరుపతి సీటు విషయంలో సక్సెస్..
తిరుపతి లోక్ సభ సీటు విషయంపైనా చర్చించామని పవన్ మీడియాకు చెప్పారు. రెండుపార్టీలూ కమిటీ వేసి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. ఇది ఒకరకంగా పవన్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి చెందిన కొందరు నాయకులు చేస్తున్న ఏకపక్ష వ్యాఖ్యలకు ఇది కచ్చితంగా బ్రేక్ వేస్తుంది. ఇక అమరావతి విషయంపైనా చర్చించారంటే.. రానున్న కాలంలో అమరావతి విషయంలో జనసేన స్పీడ్ పెంచే అవకాశం ఉంది. అదే టైంలో GHMC ఎన్నికల్లో అమరావతి ప్రాంతానికి చెందిన వారి ఓట్లు ఇక్కడ ఉంటే.. ఆ ఓట్లను బీజేపీవైపు మళ్లించే వ్యూహంగా చెప్పవచ్చు.
ఢిల్లీ వెళ్లాల్సిందేనని పట్టు..
వాస్తవానికి పవన్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని, GHMC ఎన్నికలకు పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఇక్కడకు వస్తారని, అప్పుడు మాట్లాడవచ్చని పలువురు నేతలు పవన్ కి సూచించినట్లు సమాచారం. దీనికి పవన్ అంగీకరించలేదని తెలుస్తోంది. బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడితే.. వచ్చారు కాబట్టి మాట్లాడాం అనే భావన వస్తుంది. అదే ప్రత్యేకంగా వెళ్తే.. ముఖ్యమైన అంశంగా జనసేన భావిస్తుంది కాబట్టి.. ఇక్కడిదాకా వచ్చారు అనే అభిప్రాయం ఉంటుంది..అది రెండు పార్టీలకూ గౌరవంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట పవన్. వీలైనంతవరకు సామరస్యంగానే వెళ్లాలని పార్టీ నాయకులకూ సూచించారట. అంతేకాదు.. తనకు డబ్బు మీద వ్యామోహం లేదు.. అవినీతి మరక లేదు.. జైలుకి వెళ్లిన చరిత్ర లేదు.., కేసులు పెడతారని భయం లేదు.. కాబట్టి తమ అభిప్రాయాన్ని, జనసేన వైఖరిని నిర్మొహమాటంగా ఎక్కడైనా, ఎన్నిసార్లైనా, ఏ పార్టీతోనైనా చెప్పే పరిస్థితి ఉందని జనసేనలో చర్చ కూడా నడుస్తోంది.
Also Read ;- అమరావతి రాజధానిని జనసేనాని గాలికొదిలేసినట్టేనా?
భారీ స్కెచ్ ఇదేనా..
ఇక తిరుపతి లోక్ సభ టిక్కెట్ విషయంలో మరో వ్యూహం కూడా ఉంది. గతంలో జరిగిన ఎన్నికల పరిస్థితి వేరు. అప్పుడు సాధించిన ఓట్లు వేరు.. అప్పటి ప్రాధాన్యాలు వేరు.. అప్పటి ఓటర్ల మనోగతం వేరు. కాని ఇప్పుడు వేరు.. ఓటర్లలో ఉన్న కొన్ని భ్రమలు తొలగిపోతున్నాయనే అంచనా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన సింగిల్ గాని, బీజేపీతో ఉమ్మడిగా గాని బరిలోకి దిగడం కచ్చితంగా పార్టీకి కలిసొచ్చే అంశమే. అక్కడ గెలిస్తే.. రాజకీయ సమీకరణాల్లో పెనుమార్పులు వస్తాయి. ఒక వేళ గెలవకున్నా.. రెండో స్థానంలో నిలిచినా.. భవిష్యత్తులో జనసేన, బీజేపీలకు చాలా పెద్ద సానుకూల అంశం అవుతుంది. ఇది కూడా జనసేన వ్యూహంలో ఒకటిగా కనిపిస్తోంది.
వ్యక్తితమే ఆస్తి..
జనసేనకు ముఖ్యంగా పవన్ కు బీజేపీ ఇచ్చే ప్రాధాన్యానికి మరో అంశం కూడా బలాన్నిస్తోంది. వాస్తవానికి తాను పార్టీని నడిపించేందుకూ కూడా డబ్బులేదని పవన్ గతంలో వ్యాఖ్యానించారు. ఆ డబ్బు సంపాందించేందుకే తాను మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానని బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో వేరే వేరే లోపాయకారీ ఒప్పందాలు, రాత్రిపూల ములాఖత్ లు చేసే అవకాశం ఉన్నా అవి చేసే వ్యక్తిత్వం పవన్ ది కాదని బీజేపీ ఇప్పటికే నమ్ముతోంది. అందుకే పవన్ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని, అందుకు ఢిల్లీ పర్యటనే నిదర్శనమని బీజేపీకి చెందిన కొందరు నాయకులు చెబుతున్నారట. అందుకు కొన్ని ఘటనలనూ ఉదాహరణగా చెప్పవచ్చు. 2008లోనే కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించి..అప్పట్లోనే పవన్ రూ.2కోట్లు విరాళంగా ఇచ్చారు. అప్పట్లో ఆ డబ్బు తో వ్యాపారం చేసినా.. ఆస్తులు కొన్నా పవన్ బాగానే సంపాదించేవారు. ఇక బంగారం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తన బిడ్డకు జబ్బు వచ్చిందని సహాయం చేయాలని ఒక దంపతులు అతనిని ఆశ్రయించగా స్పందించిన పవన్ కళ్యాణ్ ఆ పిల్లావాడిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి ఖర్చులన్నీ భరించి చికిత్స చేయించిన సందర్భమూ ఉంది.
పెప్సీ కూల్ డ్రింక్ సంస్థ కు అంబాసిడర్ గా కొన్నేళ్లుగా ఉన్న పవన్.. ఆ కూల్ డ్రింక్స్ లో పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నాయనే ప్రచారం మొదలుకాగానే.. ఆ యాడ్ నంచి తప్పుకున్నాడు పవన్ కల్యాణ్. ఆ టైంలో సదరు కంపెనీ పవన్ భారీ మొత్తం ఆఫర్ చేసిందట. ఆ ఆఫర్ గనుక పవన్ ఒప్పుకుంటే.. ఇప్పటికీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న వ్యక్తిగా ఉండేవాడని పవన్ సన్నిహితులు చెబుతుంటారంటే.. ఎంత మొత్తం సదరు కంపెనీ ఆఫర్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.. ఇవే కాదు.. ప్రకృతి సేద్యం, ఆధ్యాత్మికత విషయాలు కూడా పవన్ కి క్రమేణా ఇమేజ్ పెంచుతున్నాయని చెప్పవచ్చు. పవన్ తో కలిస్తే..ఇవి కూడా తమకు కలసి వస్తాయని బీజేపీ భావిస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంమీద పవన్ ఢిల్లీ టూర్ పైకి కనిపించేత చిన్న అంశం మాత్రం కాదన చెప్పవచ్చు.
Also Read ;- పవన్ సినిమాపై అవన్నీ పుకార్లే అంటున్న డైరెక్టర్