ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం అవ్వడంతో అధికార మంత్రులు, నాయకులు ఆర్తనాదాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన కలయికతో తమ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయన్నఆందోళనతో మంత్రులు పవన్ కళ్యాణ్ పై ఇష్టాను సారం కారుకూతలు కూస్తున్నారు.
విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకొని ఇబ్బంది పెట్టిన సందర్భంగా విజయవాడలో పవన్ ని కలిసి చంద్రబాబు సంఘీభావం తెలపగా, చంద్రబాబు తన సొంత నియోజక వర్గం కుప్పంలో పర్యటించడాని వెళితే పర్యటించడానికి వీలు లేదని చంద్రబాబుని అడ్డుకొని నానా ఇబ్బందులు పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలిసి సంఘీభావం తెలిపారు.వీరి కలయికతో వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలై పిచ్చి కూతలు కూస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేసేందుకు బ్రిటీష్ కాలం నాటి 1861 పోలీస్ చట్టానికి జీవో నెంబర్ 1 తెచ్చికోరలు తొడిగి రాష్ట్రానికి సంకెళ్లు వేసి ప్రజాస్వామ్యాన్ని పాతాళంలో పాతరేసింది.ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు,జీవో 1 ని ఉపసంహరింప జేసేందుకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం అయి జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ,ప్రజావ్యతిరేక విధానాల పై పోరాటం చెయ్యాలని నిర్ణయించారు.ఈ పోరాటానికి అన్ని రాజకీయ పక్షాలను సమాయత్తం చెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగానే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చంద్రబాబు తో సమావేశం అయ్యారు.
రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా కనీస ప్రజాస్వామిక హక్కులను కూడా వినియోగించుకొనే అవకాశం లేని దుర్మార్గమైన పరిపాలన సాగిస్తున్నారు,ప్రజాస్వామ్యాన్ని కాలరాసి బలమైన రాజకీయ పక్షాలను అణచివేసి అఖండ రాజకీయాధికారంతో వెలిగిపోవాలని జగన్ అండ్ కో ప్రయత్నిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఆగడాలు,అకృత్యాలు,నియంతృత్వం,కక్షసాధింపులు భరించలేని స్థాయికి చేరాయి,ఎందరో మహానుభావుల త్యాగాల పునాదుల పై నిర్మితమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకుండా జగన్ అరాచకానికి భయపడితే రాష్ట్రానికి,ప్రజలకు అన్యాయం చేసిన వారము అవుతామని, రాష్ట్ర ప్రయోజనాలకోసం కలిసి పనిచేద్దామన్న చంద్రబాబు ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. ప్రజల సమస్యలు, హక్కులపై ఒక రాజకీయ పార్టీ మాట్లాడలేని. ఉద్యమించలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, ఈ దుర్మార్గపు పరిపాలన పై పోరాడి ప్రజాస్వామిక స్వేచ్ఛను పునరుద్ధరించుకోవడమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు.
పొత్తులకు ఇప్పుడు సమయం కాదని, అవి తమ ప్రాధాన్యం కాదని ప్రజాస్వామ్యాన్నికాపాడుకోవడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. దీని పై వైసిపి నాయకులు దత్త పుత్రుడు అని, ప్యాకేజీకోసం అని,ముసుగు తొలిగిందని,అనైతిక పొత్తు అని పవన్,చంద్రబాబు పై నోరు పారేసుకొంటున్నారు.ఒక పక్కన మా పరిపాలన బ్రమ్మాoడం అని,175 కి 175 గెలుస్తామని గప్పాలు కొడుతున్న వైసిపి నాయకులు ఎవరు ఎవరి తో కలిస్తే మీకెందుకు అంత భాధ ? మీ పరిపాలన జనరంజకం అయినప్పుడు,మీకు ప్రజా మద్దతు వున్నప్పుడు ఇంతగా ఎందుకు కలవరం చెందుతున్నారో వైసిపి నాయకులు సమాధానం చెప్పాలి. పవన్, చంద్రబాబుకి దత్త పుత్రుడు అంటున్నారు, మరి జగన్ రెడ్డి సీబీఐ కి దత్త పుత్రుడు కాదా? తండ్రి తంత్రాన్ని,కొడుకు కుతంత్రాన్ని, ముడుపుల తతంగాన్ని కళ్ళకు కట్టే చిత్ర,విచిత్ర మైన అంశాలను ఎన్నింటినో వెలికి తీసి11 చార్జి షీట్లు వేసింది సీబీఐ నే, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 6 చార్జి షీట్లు వేసింది. ప్రాధమిక విచారణలో రూ 43 వేల కోట్లు ప్రజాధనం దోపిడి అయినట్లు నిగ్గు తేల్చింది సీబీఐ నే, వేలకోట్ల ఆస్తులు జప్తు చేసింది సీబీఐ నే.
మొదట్లో జగన్ వంటి ఆర్ధిక నేరగాళ్ల కు బెయిల్ ఇస్తే దోపిడీకి లైసెన్సు ఇచ్చినట్లేనని సర్వోన్నత న్యాయస్థానికి చెప్పింది సీబీఐనే, ఇన్ని కోణాలున్నఇలాంటి కేసును నేను చూడటం నా సర్వీసులో మొదటి సారి అని మాజీ సీబీఐ డైరెక్టర్ఏ,పి సింగ్ వ్యాఖ్యానించారు. అయినా కేసు విచారణ ఎందుకు వేగంగా జరగడం లేదు? అయినా ఈ రోజు జగన్ దోపిడీ ఆర్ధిక నేరాల విచారణలో సీబీఐ ఉదాసీనంగా వ్యవహరిస్తూ జగన్ రెడ్డిని దత్త పుత్రుడుగా చూసుకొంటున్నది. మరి జగన్ రెడ్డి సీబీఐ కి దత్త పుత్రుడు అంటే మీరు అంగీ కరిస్థారా? పవన్ ప్యాకేజి కోసం చంద్రబాబు ని కలిశారు అంటున్నారు, కానీ ప్యాకేజీల్లో,అవినీతిలో మీకు మించిన వారున్నారా?ఎన్నికల ముందు డొక్కు కార్లకు గతిలేనివారు మూడున్నరేళ్లలో విదేశాల్లో పరిశ్రమలు స్థాయికి ఎదిగిన వైసిపి నాయకులకు ప్యాకేజీలంటూ ఆరోపణలు చేసే అర్హత ఉన్నదా? ఎవరైనా మూడున్నరేళ్ల లో ఎంత సంపాదించగలరు?
విషoలో పుట్టిన పురుగు కు విషమే ఆహారం అయినట్లు అవినీతితో పుట్టుకొచ్చిన పార్టీ నేడు అవినీతితో పుచ్చిపోయి లుక, లుక లాడుతుంది వాస్తవం కాదా ? అడ్డు, అదుపు లేకుండా ఎన్నెన్ని మార్గాల్లో ఎన్ని వేల కోట్లు దండుకొన్నారో నిగ్గు తేల్చడం ఏ ఆర్ధిక నిపుణలకు సాధ్యం అవుతుంది?మీరా ఇతరులను ప్యాకేజి కోసం అంటూ ఆరోపణలు చేసేది? మూడున్నరేళ్లుగా సమస్త విలువలను కాలరాసి ధన రాసులు పోగేసుకొనే విద్యుక్త ధర్మ నిర్వహణలో నిష్టగా పరిశ్రమిస్తున్నారు వైసిపి నాయకులు. తాము అవినీతి బురదలో కూరుకు పోయి రాజకీయ ప్రత్యర్థులను కూడా అవినీతి పరులుగా చిత్రిoచాలన్న అక్కసుతో ప్యాకేజి అంటూ మతిలేని ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి ఏమి లేక నోటికి వచ్చినట్లు విమర్శిస్తున్నారు. చంద్రబాబు,పవన్ కలయికతో కాళ్ళకింద భూమి కదిలి పోయి తమ అవినీతి సామ్రాoజ్యం కుప్ప కూలుతుందని దిక్కు తోచక దిక్కు మాలిన ఆరోపణలు చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న సమస్త విధానాలు అన్ని అప్రజాస్వామిక మైనవే కాదు.
అనాలోచిత మయినవి,అసంబద్దమైనవి,నిరంకుశమైనవే. ప్రజలకు,ప్రతిపక్షాలకు రాజ్యాంగ బద్దంగా కల్పించిన హక్కులను కాలరాయడం,శాంతియుత ప్రదర్శనలకు సభలకు అనుమతులు నిరాకరించడం, ముందస్తు అరెష్టులకు పాల్పడటం వంటి నిర్బంధాలతో ,పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యం,రాజ్యాంగం,ప్రజల పట్ల ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం,రాజ్యాంగం అనాధలుగా మారాయి.పోలీసు వ్యవస్థ మొత్తం జగన్ జాగీర్ గా మారింది.నేడు జగన్ పాలనలోఆంధ్రప్రదేశ్ లో, చట్టాలు. లా-అండ్ ఆర్డర్ పూర్తిగా విఫల మయ్యాయి.చట్టం,న్యాయం,ధర్మం, నైతికత,ప్రజాసామ్యం ,రాజ్యాంగం,విలువల తో నాకు సంభందం లేదు.నేను చేసిందే చట్టం,నేను చెప్పిందే రాజ్యాంగం అన్న విధంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు.మానిర్ణయాలు కాదంటే సహించం,రాజ్యాంగం అయినా,ప్రజాస్వామ్యం అయినా,న్యాయవ్యవస్థ అయినా,మీడియా అయినా,ప్రతిపక్షాలు అయినా,ప్రజలయినా మా వెనక నడవాల్సిందే. అన్నవిధంగా వ్యవహరిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రభుత్వం విధానాలపై ప్రశ్నించే,నిరసన తెలిపే హక్కు ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి స్వేచ్చగా జీవించే హక్కు వుంటుంది.ఆర్టికల్ 19[1a] ప్రకారం ప్రాధమిక హక్కుగా ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛకు తూట్లుపొడిచారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.ఏ రాచరికంలోను,ఏ నియంత పాలనలోను కనిపించని దౌర్జన్య కాండ రాష్ట్రం లో కొనగుతుంది.రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నవారు 21 శతాబ్దంలో వున్నామా?కిరాతక పాలనలో వున్నామా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం,విమర్శించడం సహజం.కానీ జగన్ పాలనలో ప్రశ్నించడం,విమర్శించడం నేరం.ఎంత సేపు ప్రశించే వారిని వేధించడం, అణచివేయ్యడమే లక్ష్యంగా పెట్టుకొన్నది జగన్ ప్రభుత్వం. ప్రభుత్వం ఏంచేసినా ప్రతిపక్షం నోరు ఎత్త కుండా చేతులు కట్టుకొని వుండాలి. ప్రభుత్వ అవినీతికి, చేతకాని తనానికి ప్రతిపక్షం భజన చెయ్యాలి.
రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పాపం నుండి ప్రజల దృష్టి మళ్లించెందుకు ప్రజల కళ్ళకు గంతలు కట్టేందుకు బ్రిటీష కాలం నాటి 1861 చీకటి తెచ్చి రాష్ట్రానికి సంకెళ్లు వేసింది జగన్ ప్రభుత్వం.ప్రతీకార రాజకీయంపై చూపిస్తున్న పట్టుదల, రాష్ట్రాభివృద్ది పై, ప్రజా ప్రయోజనాలు నెరవేర్చడం పై చూపడంలేదు. జర్మనీలోనాజీల దురాగతాలను కళ్ళకు కడుతున్నది జగన్ పాలన. ఇండియన్స్ ఫీనల్ కోడ్ [ఐపిసి]ని వైసిపి ఫీనల్ కోడ్ గా మార్చారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ విధమైన నిర్భంధాలతో, నియంతృత్వంతో కక్ష సాధింపులతో ఏ ప్రభుత్వం,ఏ ముఖ్యమంత్రి వ్యవహరించలేదు. బ్రిటీష్ పాలకులకు వారసుడిగా జగన్ పాలన సాగుతున్నది.
ఆంధ్రప్రదేశ్ నిగుండారాజ్ గా మార్చారు.భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఫాసిష్ఠుల రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు. కక్షసాధింపులు, అరాచకం, దౌర్జన్యాలు, నిర్బంధాలు, దాడులు భరించలేక ఇప్పటికే ప్రజల్లో తిరగు బాటు మొదలైందని జగన్ రెడ్డి గుర్తించాలి. కావునా ప్రజాస్వామ్యాన్ని రక్షించి రాష్ట్రాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యం బతకాలి అంటే రాజకీయ పార్టీలు బలంగా ఉండాలి.రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సరికొత్త విప్లవానికి అన్ని రాజకీయ పక్షాలను సమాయత్తం చెయ్యాలని నిర్ణయించడంతో జగన్ శిభిరంలో కలవరం మొదలయింది.