వైసీపీ హయాంలో ఏపీలో దారుణ పరిస్థితులను మరోసారి గుర్తు చేశారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారంటూ మండిపడ్డారు. ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో ఏపీ నుంచి అమర రాజ కంపెనీని జగన్ తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్, అండర్‌వేర్ కంపెనీలనూ సైతం జగన్ వదల్లేదన్నారు. కుట్ర పూరితంగా రాజధాని అమరావతి నిర్లక్ష్యం చేశారన్నారు.
ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్‌నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ఒక్క ఫోన్ కాల్‌తో జగన్ రాష్ట్రం నుంచి కంపెనీలను వెళ్లగొడితే….ఒకే ఒక్క జూమ్ మీటింగ్‌తో ఆర్సెలార్ మిత్తల్ కంపెనీని రాష్ట్రానికి రప్పించిన ఘనత కూటమి సర్కార్‌ది అన్నారు. దాదాపు లక్షా 70 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేలా కూటమి సర్కార్ చర్యలు తీసుకుందన్నారు. ఇది గత జగన్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా అని వివరించారు.
ఏపీలో పెట్టుబడులకు ఏ కంపెనీ ముందుకు వచ్చినా రెడ్ కార్పెట్‌తో ఆహ్వానిస్తామన్నారు పయ్యావుల. చివరకు వైఎస్ జగన్..మరో భారతీ సిమెంట్ పరిశ్రమను పెడతామన్న సహకరిస్తామన్నారు. రాష్ట్రానికి కంపెనీలు రావాలి… యువతకు ఉపాధి కల్పించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు 67 కంపెనీల CEOలతో సమావేశమయ్యారని, అధికారుల కంటే ముందుగానే ఇండియా పెవిలియన్‌లోకి వెళ్లి కూర్చునేవారని చెప్పారు. 28 రంగాలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. అదే వైసీపీ హయాంలో దావోస్‌లో 11 రోజులు పర్యటించి 46 మందినే కలిశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అగ్రిమెంట్ దశలోనే ఆగిపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
2022లో ఏపీకి చెందిన అమర రాజా కంపెనీ…తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో 9 వేల 500 కోట్లతో పెట్టుబడులు పెట్టింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిన కంపెనీ తెలంగాణకు రావడంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. వైసీపీ సర్కార్ వేధింపుల వల్లే ఏపీ నుంచి వెళ్లిపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. భూములు కేటాయించకపోవడం, రైడ్స్, అనుమతుల నిరాకరణ పేరుతో కంపెనీలను జగన్ సర్కార్ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.