ఎమ్మెల్యే పద్మావతి జాడ చెప్పండి ప్లీజ్..
అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఈ మధ్య తప్పిపోయారంటూ.. సోషల్ మీడియాలో ప్రజలు కొడైకూస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేరింది. మా ఎమ్మెల్యే కనిపించడం లేదోచ్చ్ అంటూ .. నియోజకవర్గంలో పోస్టర్ వెలిసింది. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్యే పద్మావతి కనిపించడం లేదంటూ వెలసిన పోస్టర్ మీడియాలో హల్చల్ చేస్తోంది! ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన పద్మావతి.. గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు. తెలిస్తే.. ఆమె ఆచూకీ తెలపగలరంటూ పోస్టర్లో తాటికాయంత అక్షరాలతో శింగనమల నియోజకవర్గ పరిధిలోని గుంజేపల్లి గ్రామం ప్రధాన కూడలిలో పోస్టర్ వేశారు ప్రజలు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ గోడు విన్నవించాలంటే ఎమ్మెల్యే ఆచూకి తెలియక ఇలా .. పోస్టర్ వేశామని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే పద్మావతి వ్యవహార శైలిపై అనేక విమర్శలు లేకపోలేదు. తన బావా కుమారుడు పెత్తనం చేస్తూ.. అనేక వివాదాలను ఆమె మెడకు చుట్టారు. బుక్కరాయ సముద్రంలో ఈ మధ్య ఏర్పాటు చేసిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం జిల్లా స్థాయి ప్రారంభోత్సవం సందర్భంగా అరుణ అనే మహిళపై ఎమ్మెల్యే బావ కొడుకు ఎర్రిస్వామి రెడ్డి వాడి పదజాలం అప్పట్లో వివాదస్పదంగా మారాయి.
నేనక్కడికి పోలేదు.. ఇంట్లోనే ఉన్నాను..
శింగనమల నియోజకవర్గ పరిధిలోని గుంజేపల్లి గ్రామస్థుల ఆరోపణలపై ఎమ్మెల్యే పద్మావతి స్పందించారు. తన భర్త సాంబశివారెడ్డికి కరోనా వచ్చిందని, అందుకే తామంతా క్వారంటైన్ లో ఉన్నామని బదులిచ్చారు. కరోనా వచ్చిన పర్వాలేదు అనుకుంటే తనను కలవడానికి ఇంటికి రావాలని గ్రామస్థులకు సూచించారు. ఎమ్మెల్యేగా రూల్ బుక్ ప్రకారమే తాను వెళ్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తాను కనిపించడం లేదంటూ వైరల్ చేస్తున్న పోస్టర్ వెనుక ఎవరు ఉన్నారో తనుకు తెలియదన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కుటుంబానికి కరోనా సోకిన విషయాన్ని నియోజకవర్గ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పద్మావతి ఎందుకు తెలిపలేకపోయారని నెటిజన్ మరోవైపు ట్రోల్ చేస్తున్నారు.