వైసీపీ తరఫున,. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫునా… వకాల్తా పుచ్చుకున్నట్లుగా వ్యవహరించిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని తీరు ఇప్పుడు పెను వివాదాస్పదంగా మారిపోయింది. తన భార్యను కేసుల నుంచి తప్పించడంతో పాటుగా అరెస్ట్ కాకుండా చూసుకునే క్రమంలో నాని తన ఫ్యామిలీతో కలిసి ఏకంగా విదేశాలకు పారిపోయినట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లలో నిజం ఏ మేరకు ఉందన్న విషయాన్ని పక్కనపెడితే… గడచిన వారం రోజులుగా కుటుంబంతో కలిసి నాని కనిపించకుండా పోయిన తీరు చూస్తుంటే… నాని నిజంగానే దేశం విడిచి పారిపోయి ఉంటారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీపైనా, జగన్ పైనా ఈగ వాలినా క్షణాల్లో మీడియా ముందు ప్రత్యక్షమయ్యే నాని… వైరి వర్గాలపై తనదైన శైలిలో విరుచుకపడే వారు. అయితే ఇప్పుడు తన కుటుంబంపైనే అవినీతి ఆరోపణలు వస్తుంటే మాత్రం స్పందించడానికి నాని అందుబాటులోకి రాకపోవడం పెను అనుమానాలకే తావిస్తోంది. తప్పు చేసిన నాని కుటుంబం ఆ తప్పును సరిదిద్దుకునే యత్నం చేస్తోందని, అయితే ఆ దిశగా రిజల్ట్ కనిపించకపోవడంతోనే నాని మొత్తం ఫ్యామిలీనీ తీసుకుని విదేశాలకు పారిపోయారని తెలుస్తోంది.
వైసీపీ అధికారంలోకి రాగానే కాస్తంత వాగ్దాటి ఉన్న నానికి జగన్ మంచి ప్రాధాన్యమే ఇచ్యారు. మంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్… ఆయనకు ఏకంగా రవాణా శాఖతో పాటుగా సమాచార, పౌర సంబంధాల శాఖలను అప్పగించారు. అంతేకాకుండా మరింత కీలకమైన సినిమాటోగ్రఫీని కూడా నానికే అప్పగించారు. వెరసి జగన్ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా నాని బాగానే రాణించారు. ఈ క్రమంలోనే తన సొంతూరు మచిలీపట్నంలో అతి పెద్ద గోదామును ఏర్పాటు చేశారు. దానిని తన సతీమణి జయసుధపై కట్టిన నాని… తన అధికారాన్ని వినియోగించుకుని… గోదామును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకనేలా మంత్రాంగం నడిపారు.
ఇక్కడదాకా బాగానే ఉన్నా… ఎన్నికల్లో వైసీపీ ఓడిి టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టడంతో అసలు సమస్య మొదలైంది. నాని గోదాము నుంచి ఏకంగా 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైవందని తేలగా.. కనిపించకుండాపోయిన బియ్యం ఖరీదు చెబితే… దానిని తాను చెల్లిస్తానని నాని చెప్పారు. వెరసి ఆ బియ్యం తనకు తెలిసే మాయమైందని నానినే స్వయంగా ఒప్పుకున్నట్టు అయ్యింది. దీంతో సివిల్ సప్లస్ శాఖ అధికారుల ఫిర్యాదు ఆధారంగా గోదాము యజమానిగా ఉన్న జయసుధపై కేసు నమోదు అయ్యింది.
తన సతీమణిపై కేసు నమోదు కాగానే నాని వణికిపోయారనే చెప్పాలి. కేసు నమోదు అయిన మరుక్షణమే ఆయన మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయించారు. అయితే ఈ పిటిషన్ ను తొమ్మిదో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా జడ్జీ నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిదో అదనపు జిల్లా జడ్జీ కోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాగా… పోలీసుల నుంచి కేసు డైరీ అందని కారణంగా ఈ పిటిషన్ పై విచారణను న్యాయమూర్తి ఈ నెల 19కి వాయిదా వేశారు.అంటే… ఈ పిటిషన్ పై విచారణకు ఇంకో 3 రోజుల సయం ఉంది. ఈలోగా పోలీసుల కంటబడితే జయసుధ అరెస్ట్ ఖాయమే.
ఈ అంచనాతోనే కేసు నమోద అయిన మరుక్షణమే ఇంటి నుంచి పరార్ అయిన నాని… కోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేయించారు. అంతేకాకుండా ముందస్తు బెయిల్ లభించేదాకా మచిలీపట్నంలో ఆయన అడుగు పెట్టరన్న దిశగానూ ప్రచారం సాగుతోంది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ఖాళీగా కూర్చోరు కదా. జయసుధ కోసం గాలిస్తున్నారు. నాని ఇంటికి వారానికి పైగా తాళం కప్ప కనిపిస్తున్న నేపథ్యంలో వారి ఆచూకీ కోసం ఏకంగా ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దింపారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాతే నాని దేశం వదిలి పరారైైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.