ఏపీ లిక్కర్ స్కామ్‌లో రోజుకో సంచలనం నమోదవుతోంది. ఈ కేసులో వరుస అరెస్టులతో సిట్ దూకుడు పెంచుతుండడంతో వైసీపీలో టెన్షన్ మొదలైంది. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అరెస్టు తప్పదా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ఈ వాదనకు బలం చేకూర్చేలా కామెంట్స్ చేశారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని. ఈ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితులైన నేతలు, అధికారులు అరెస్టు కావడంతో త్వరలోనే జగన్ అరెస్టయ్యే అవకాశం ఉందంటున్నారు పేర్ని నాని.
లిక్కర్ స్కామ్‌లో జగన్ అరెస్టు ఖాయమని తేల్చేశారు పేర్ని నాని. లిక్కర్ స్కామ్ లో జగన్ పాత్రపై త్వరలోనే తేల్చనుంది సిట్. ఇప్పటికే ఎవరెవరికి ముడుపులు అందాయి, వాటిని హవాలా రూపంలో విదేశాలకు ఎలా తరలించారు అనే వివరాలను సిట్ సేకరించింది. అరెస్టయిన వారి నుంచి సిట్ మరిన్ని వివరాలు సేకరిస్తోంది.
జగన్‌కు అత్యంత క్లోజ్‌గా ఉన్న అధికారుల అరెస్టుతో జగన్ అరెస్టు తథ్యం అనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ నిందితులు లిక్కర్ స్కామ్ లో తమకు పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా చేశామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే జగన్ రెడ్డికు నోటీసులు ఇచ్చి మరికొద్ది రోజుల్లోనే విచారణకు పిలవడం ఖాయం. దీంతో ఆయన అరెస్ట్ ఖాయమని పేర్ని నాని ఆందోళన చెందుతున్నారు. లిక్కర్ స్కామ్ లో జగన్ ఎలాంటి పాత్ర పోషించారో దాదాపు తేలిపోయింది. దీంతో బిగ్‌బాస్ అరెస్టును ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశంపై వైసీపీ అప్పుడే ప్రిపేర్ అవుతున్నట్టు పేర్ని నాని డైలాగ్స్ ఉన్నాయి. జగన్ కు లిక్కర్ స్కామ్ మరకలు అంటకుండా ఉండేలా డైలాగ్స్ సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది.
తాజాగా లోకేష్.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది.. లోకేష్‌తోపాటు ఆయన భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ కూడా ఉన్నారు.. ఈ సందర్భంగా జగన్ అరెస్ట్‌పై ఓ క్లారిటీ వచ్చి ఉంటుందని, వైసీపీ హైకమాండ్ భావిస్తోంది.. అందుకే, ముందస్తు లీకులు తాము ఇస్తేనే బెటరనే భావనలో ఉన్న వైసీపీ… అరెస్ట్ రాగం అందుకుందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.. లిక్కర్ స్కాములో జగన్ అండ్ టీమ్ ఏ రేంజ్‌లో దోచుకుందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదని, ఏపీలో ఎవరిని అడిగినా పుంఖానుపుంఖానులుగా చెబుతారు.. ఆన్‌లైన్ పేమెంట్ లేకుండా కేవలం క్యాష్ పేమెంట్స్‌తోపాటు చీప్ లిక్కర్ జగన్ అండ్ టీమ్ సాగించిన దందా గురించి ఎంత చెప్పినా తక్కువే.. మరి, జగన్ అరెస్ట్ అవుతారని వైసీపీ నేతలే ఓ అంచనాకి రావడంతో అది ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.











