టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితుల నియామకంపై అర్చకుడు వేణుగోపాల దీక్షితులు హైకోర్టులో పిల్ వేశారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా రమణదీక్షితులను ఎలా నియమిస్తారంటూ, వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులుగా ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులను చేర్చారు. దీనిపై విచారించిన హైకోర్టు ముగ్గురు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీంతో టీటీడీలో అర్చకుల వివాదాలు కోర్టుకు చేరాయి. ప్రభుత్వం తీసుకున్న అసంబద్ద నిర్ణయంతో అర్చకుల్లో వివాదాలు మొదలయ్యాయనే విమర్శలు వస్తున్నాయి.
గ్రూపులుగా విడిపోయిన అర్చకులు
రమణ దీక్షితులను టీటీడీ ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అర్చకుల మధ్య వివాదం మొదలైంది. 65 సంవత్సరాలు నిండిన వారు రిటైర్మెంట్ తీసుకోవాలని గత ప్రభుత్వం రమణదీక్షితులను పదవి నుంచి తొలగించింది. దీంతో గొల్లపల్లి వంశం నుంచి వేణుగోపాల దీక్షితులు ప్రధాన అర్చకులు అయ్యారు. మరలా వైసీపీ ప్రభుత్వం తాజాగా రమణ దీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడంతో అర్చకుల మధ్య వివాదాలు మొదలయ్యాయని తెలుస్తోంది.