ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గత ఏడాది కాలంగా సర్వేలు బాగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అన్ని సర్వేలు కూడా టీడీపీనే ఈసారి అధికారం చేపడుతుందని అంచనా వేస్తున్నాయి. టీడీపీ – జనసేన కూటమి ప్రకటన తర్వాత అధికార పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయింది. అధికార వైసీపీ కూడా సర్వేలు చేయించుకోగా అందులోనూ పార్టీ అధినేత జగన్ కు దిమ్మతిరిగే ఫలితాలు ఎదురు అవుతూ వచ్చాయి. వై నాట్ 175 అనే సంగతి అటుంచితే.. ఈసారి వైసీపీకి పరువు పోయే స్థాయిలో సీట్లు దక్కుతాయని సర్వే అంచనాలు చెబుతున్నాయి. అయితే, భవిష్యత్తు అంతా జగన్ కు కళ్ల ముందు కనిపిస్తుండడంతో ముఖ్యమంత్రి జగన్ ఇక తన ఓటమి తప్పదని ఫిక్స్ అయిపోయినట్లుగా కూడా చెబుతున్నారు.
తాజాగా రాబోయే ఎన్నికలకు సంబంధించి మరో సంచలన సర్వే ఒకటి రీలీజ్ అయింది. ‘పయనీర్ పోల్’ సర్వే పేరుతో ఈ నివేదిక విడుదల కాగా.. ఇందులో కూడా టీడీపీ – జనసేన ప్రభంజనం చూపించింది. ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 స్థానాలు ఉండగా టీడీపీ – జనసేన కూటమి ఏకంగా 104 సీట్లు గెలుచుకోనుందని పయనీర్ పోల్ సర్వే అంచనా వేసింది. అధికార వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పదని తేల్చి చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ఇప్పటి అధికార పార్టీ 47 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అయితే 24 స్థానాల్లో మాత్రం పోటీ నువ్వు నేనా అన్నట్టుగా ఉంటుందని విశ్లేషించింది.
ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే ఏపీలో మొత్తం ఉన్న 25 స్థానాల్లో టీడీపీ – జనసేన అత్యధికంగా 18 సీట్లు గెల్చుకుంటుందని పయనీర్ పోల్ సంస్థ అంచనా వేసింది. వైసీపీ మరో 7 సీట్లు దక్కించుకోనుందని విశ్లేషించింది. ఓటు శాతం పరంగా చూస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమికి అత్యధికంగా 52 శాతం దక్కుతుందని అంచనా వేశారు. అధికార వైసీపీ ఓటు శాతం 42 శాతానికి పడిపోతుందని చెప్పారు. రాయలసీమలో ఉమ్మడి అనంతపురం జిల్లా తప్ప మిగతా మూడు జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తక్కువగా ఉందని అంచనా వేశారు. వైఎస్ షర్మిల ప్రభావంతో కాంగ్రెస్ ఓటు శాతం వచ్చే ఎన్నికల్లో అనూహ్యంగా పెరగనుందని అంచనా వేశారు. రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరుగుతాయని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ కు దాదాపు 2.4 శాతం ఓట్లు వస్తాయని లెక్క వేశారు. ఇక బీజేపీకి 1.5 శాతం ఓట్లు, ఇతరులకు 2.1 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు.
పయనీర్ పోల్ సంస్థ ఈ సర్వేను ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 14 తేదీ మధ్య నిర్వహించినట్టు తెలిపింది. ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో వివిధ రంగాలకు చెందిన 90 వేల మంది ప్రజలను ఒపీనియన్ ను తీసుకున్నట్లుగా సర్వే సంస్థ చెప్పింది. వీరిలో పురుషులు 52 శాతం, స్త్రీలు 48 శాతంగా ఉన్నారని వెల్లడించింది. ఏపీలో ఉన్న పార్టీలు.. వైసీపీ, టీడీపీ – జనసేన, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, బీసీఐ, ఆప్, జై భారత్ పార్టీ వంటి పార్టీలను కూడా తమ సర్వేలో పరిగణనలోకి తీసుకున్నామని పయనీర్ పోల్ ప్రతినిధులు వెల్లడించారు. మొత్తానికి ఓట్ల శాతం, సీట్ల విషయంలో టీడీపీ-జనసేన కూటమి దూసుకుపోతుండడంతో మరో సర్వే ద్వారా స్పష్టం అయింది. దీంతో వైసీపీ వర్గాలు మరింత ఉసూరుమంటున్నాయి.