అప్పుడెప్పుడో వచ్చిన ఓ సినిమాలో.. కోడి కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని ఓ మనిషి చనిపోయాడని పోలీసులు ఆ కోడిని అరెస్టు చేస్తారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. పోలీసులు మరీ అంత అమాయకులా! అంటూ.. ప్రేక్షకులు వెటకారం చేశారు. కానీ, ఇప్పుడు అచ్చు అలాంటి సన్నివేశమే జగిత్యాల జిల్లాలో జరిగింది. కోడి కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని సతీష్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఎవరిని అరెస్టు చేయాలి? వేరే ఆలోచన లేకుండా.. చూసిన వాళ్లు నవ్వుతారన్న ఇంగితం కూడా లేకుండా పోలీసులు.. కోడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కోడిని ఏ1 ముద్దాయిగా చేర్చారు. స్టేషన్లో కట్టేశారు. కాసేపు సెల్లో ఉంచుతారు. మరికేసేపు చెట్టుకిందకు మారుస్తారు.
అసలు కథేంటి?
జగిత్యాల జిల్లా, వెలగటూరు మండలం, కొండపూర్కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు.. తన స్నేహితులతో కలిసి కోడిపందేలు నిర్వహించాడు. కోడిని పందెంలో దించే సమయంలో కత్తి కట్టిన కాలును కాకుండా మరో కాలిని పట్టుకున్నాడు. దీంతో.. కోడి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కోడిపుంజును సతీష్ గట్టిగా పట్టుకోవడంతో.. దాని కాలికి అమర్చిన కత్తి అతడి పొట్టలో గుచ్చుకుంది. అక్కడున్న అతడి స్నేహితులు.. బాధితుడిని జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు వ్యక్తి మరణానికి కారణమైన కోడి అరెస్టు చేసి.. స్టేషన్లో కట్టేశారు. కోడి పందేలు ఆడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా సతీష్ మరణానికి కోడే కారణమని దాన్ని ఏ1 ముద్దాయిగా చేర్చారు. త్వరలో ఆ కోడిని కోర్టులో కూడా ప్రవేశపెట్టనున్నారు.
Must Read ;-, బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పోలీసులే కారణం..