వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన నిండు ప్రాణాలను బ*లితీసుకున్న విషయం తెలిసిందే. ఐతే జగన్ పర్యటనలో కారు ఢీకొట్టడం వల్ల చ*నిపోయిన చీలి సింగయ్య కేసులో నల్లపాడు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడం వల్లనే ఎస్సీ వర్గానికి చెందిన చీలి సింగయ్య మృ*తి చెందినట్టు నల్లపాడు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
జగన్ ఈ నెల 18న పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు మార్గమధ్యంలో గుంటూరు సమీపంలోని ఏటుకూరు వద్ద ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు సింగయ్యను జగన్ ర్యాలీలో పాల్గొన్న వేరే వాహనం ఢీకొందని భావించిన పోలీసులు..ఆ దిశగా దర్యాప్తు చేశారు. అనూహ్యంగా బయటకొచ్చిన ఓ వీడియోలో ఆ రోజు ఏం జరిగిందీ తెలిసింది.
ఏటుకూరు వద్ద జాతీయరహదారి నుంచి సర్వీసు రోడ్డులోకి మలుపు తిరిగే ప్రదేశంలో జగన్ వాహనం కింద సింగయ్య పడిపోయినట్టు కొందరు కార్యకర్తలు గమనించి..ఆపాలని డ్రైవర్‌కు కార్యకర్తలు సైగ చేసినట్టు ఆ వీడియోలో ఉంది. దీంతో సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజీలు, డ్రోన్ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు.. జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య పడి ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు.
సంఘటన సమయంలో అక్కడున్నది ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడుకు చెందిన వైసీపీ కార్యకర్తలుగా గుర్తించి..వారిని పిలిచి ఆ రోజు ఏం జరిగిందన్న విషయమై విచారించారు. చనిపోయింది సింగయ్యేనా అని వారిని అడిగి నిర్ధారించుకుని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సింగయ్య మృతిచెందిన రోజు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ర్యాలీలో ఉన్న వాహనం ఢీకొందని చెప్పి దాని నంబరు ప్రస్తావించారు. అప్పటికి పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోవడంతో ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం గుర్తుతెలియని వాహనం ఢీకొందని పేర్కొంటూ బీఎన్‌ఎస్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదుచేశారు.
ఏటుకూరు వద్ద మాజీ సీఎం జగన్ కాన్వాయ్ సర్వీసు రోడ్డులోకి వచ్చేటప్పుడు వైసీపీ కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై నానా హడావుడి చేశారు. కాన్వాయ్‌కు ఎదురుగా వెళ్లి జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందుభాగంలో ఎక్కి బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో జగన్.. తన వాహనంపై నుంచే అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ క్రమంలోనే ఆయన వాహనం కింద పడి సింగయ్య ప్రాణాలు వదిలాడు.