ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు వద్దు అంటూ అమరావతి రైతులు గత కొన్ని నెలలుగా ఉద్యమాలు, దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఈ రోజు నుంచి మరో కొత్త పంథాలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని భావించినట్లు తెలుస్తుంది. అనుకున్నట్లుగానే సోషల్ మీడియా వేదికగా తమ ఉద్యమ తీవ్రతను పెంచారు.
సీఎం, పీఎం, రాష్ట్రపతిని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ తమ బాధలను తెలపాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా రాజధాని అమరావతి విషయంలో పోలీసుల తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అసలేం జరిగిందంటే…
సరిగా ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తరువాత మూడు రాజధానుల ప్రకటన రావడంతో రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. దీంతో రాజధాని నగరంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. అయినప్పటికీ రాజధాని రైతులు, మద్దతుదారులు పట్టు వదలకుండ నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో ఈ రోజు మందడం సీడ్ యాక్సెస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన దళిత బహుజన జేఏసీ నేతలు. రాజధాని శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా మోదీ గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకానికి వినతి పత్రం అందజేస్తామంటూ ఆందోళన చేపట్టారు. నల్ల జెండాలు చేతిలో పట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
మీరు వెళ్తే.. వారు వస్తారు.. త్వరగా ఖాళీ చేయండి
అంతేకాకుండా అక్కడితో ఆగకుండ ఉద్దండరాయుని శంకుస్థాపన ప్రదేశంలో నిరసన చేస్తున్న రైతుల వద్దకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని ‘మీరు ఈ ప్రదేశాన్ని సాయంత్రం 4 గంటల కల్లా ఖాళీ చేయాలి. మీరు వెళ్లిన తరువాత మూడు రాజధానులకు మద్దతునిచ్చే రైతులు వస్తారంటూ’ తెగ హడావిడి చేసారు.
అసలు వారెందుకు వస్తున్నట్లు..?
ఇప్పుడు రాజధాని నగరంలో నిరసనలు చేసే వారంతా ‘ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని’నినాదంతో ఉద్యమం చేస్తున్నారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి కానీ మూడు రాజధానులు వద్దు అంటూ వారు నిరసనలు చేస్తుంటే.. మూడు రాజధానులు కోసం ఆందోళన చేస్తున్న రైతులు ఎందుకు అమరావతి శంకుస్థాపన ప్రదేశానికి రావడం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వద్దు అనుకున్న వారు నిరసనలు, ఉద్యమాలు చేస్తే ఓ అర్థం ఉంది. కానీ.. మూడు రాజధానులు కావాలి అనుకున్న వారు ఎందుకు రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నారు అనే దాని మీద సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.