చిన్ననాటి స్నేహితుడు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి జగన్ వెన్నుపోటు పొడుస్తున్నారా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. గడికోటకు రాజకీయ భవిష్యత్ లేకుండా జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ గడికోటకు ప్రత్యర్థులుగా వ్యవహరించిన సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు బాలసుబ్రహ్మణ్యాన్ని పార్టీలో చేర్చుకునేందుకు జగన్ రెడ్డి చర్చలు జరిపారు. రాయచోటి టిక్కెట్ కూడా బాలసుబ్రహ్మణ్యానికి ఆఫర్ చేసినట్లు సమాచారం.
సుగవాసి కుటుంబం బలమైన బలిజవర్గానికి చెందిన కుటుంబం. ఎప్పుడూ వైఎస్ కుటుంబానికి వ్యతిరేకమే. సుగవాశి పాలకొండ్రాయుడు విజయాలు సాధించినా ఆయన వారసులకు అదృష్టం కలిసిరాలేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా లాభం లేకుండా పోయింది. అయినా టీడీపీ అధినాయకత్వం ఆ కుటుంబానికి ఎప్పటికప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంది. ఐతే 2025 ఎన్నికల్లో రాయచోటిలో సుగవాసి కుటుంబానికి సానుకూల పరిస్థితులు లేవని..రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీ. దీంతో ఆయన విజయం సాధించారు.
అయితే సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు రాజంపేట టిక్కెట్ ఇచ్చారు.టీడీపీకి ఎంతో సానుకూలత ఉండే నియోజకవర్గంలో ఆయన విజయం సాధించలేకపోయారు. తనను టీడీపీ నేతలే ఓడించారని ఆరోపణలు చేశారు. ఇటీవల పాలకొండ్రాయుడు మరణించారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని జగన్ రెడ్డి ఆకర్షిస్తున్నారు. రాయచోటి టిక్కెట్ ఆఫర్ ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారు. అక్కడ ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డికి భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకున్నట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్నేహితుడని జగన్‌ను నమ్ముకుని కష్టకాలంలో అండగా నిలబడిన శ్రీకాంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ డేంజర్‌లో ఉన్నట్లే.











