ఉప ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ శనివారం రాత్రి 7 గంటలకు పూర్తి అయిపోయింది. దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. అందులో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఏపీలోని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరిగాయి. హుజూరాబాద్‌లో ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. బద్వేల్‌లో వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక జరిగింది. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అటు టీఆర్ఎస్, బీజేపీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిలవగా.. బద్వేల్‌లో మాత్రం వైసీపీకి ఈజీ గెలుపుగానే చెప్పాలి. మొత్తంగా ఇన్ని రోజులుగా జనం నోళ్లలో నానుతున్న హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. జనం తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. నవంబరు 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అప్పటిదాకా అన్ని పార్టీలు తమదే విజయమంటే.. కాదు తమది విజయమని చెప్పుకోవడం మాత్రమే మిగిలి ఉందని చెప్పాలి.
హుజూరాబాద్‌లో రికార్డు పోలింగ్
చెదురు మదురు ఘటనలు మినహా హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు చోటుచేసుకున్నా.. స్థానిక పోలీసులతో పాటు భారీగా మోహరించిన కేంద్ర బలగాలు పరిస్థితిని చక్కదిద్దేశాయి. ఆదిలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా.. అధికారులు యుద్ద ప్రాతిపదికన వాటిని బాగు చేసి పోలింగ్ ప్రారంభించారు. ఫలితంగా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ పోలింగ్ చివరిదాకా సజావుగానే సాగింది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోలింగ్‌లో ఓటర్లు కూడా భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాత్రి 7 గంటలకు పోలింగ్ ముగియగా.. 86.40 శాతం పోలింగ్ నమోదు అయినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రం ముందు వరుసలో నిలుచున్న వారితో అధికారులు ఓట్లు వేయిస్తున్నారు. ఈ కారణంగా పోలింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. 2018 ఎన్నికల్లో ఇక్కడ 84.42 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే ఈ దఫా మాత్రం దానిని మించి 86.40 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అయితే మరింత మంది ఓట్లు వేసేందుకు బారులు తీరిన నేపథ్యంలో ఈ శాతం మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. మొత్తంగా హుజూరాబాద్‌లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైందనే చెప్పాలి.
బద్వేల్‌లో తగ్గిన పోలింగ్
ఇదిలా ఉంటే.. బద్వేల్ ఉప ఎన్నికలో మాత్రం పోలింగ్ భారీగా తగ్గిపోయింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ 76.37 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఇప్పుడు మాత్రం 68.12 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో జరిగిన ఈ ఉప ఎన్నికలో వైసీపీ తన అభ్యర్థిగా ఆయన సతీమణి దాసరి సుధనే నిలబెట్టడంతో సంప్రదాయాన్ని గౌరవించి టీడీపీ, జనసేన పోటీకి దిగలేదు. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. 2019లో వచ్చిన మెజారిటీ కంటే అధిక మెజారిటీ సాధించాలని సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. పలువురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలను కూడా జగన్ బద్వేల్‌లో మోహరించారు. మెజారిటీ పెంచుకునేందుకు వైసీపీ చేసిన యత్నాలు ఏ మేర ఫలించాయో తెలియదు గానీ.. ఓటర్లు మాత్రం పెద్దగా ఓటింగ్‌కు హాజరు కాలేదు. మధ్యాహ్న సమయంలో బద్వేల్ పరిధిలో భారీ వర్షం కురవడం కూడా పోలింగ్ శాతం తగ్గడానికి ఓ కారణంగా చెబుతున్నారు. వైసీపీ దౌర్జన్యాలు, దొంగ ఓట్ల కోసం ఇతర నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించడం వంటి పరిణామాలతో జనం బెంబేలెత్తిన కారణంగా కూడా పోలింగ్ తగ్గిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ, జనసేనలు పోటీకి దూరంగా ఉండటంతో ఆ పార్టీకి చెందిన ఓటర్లు పోలింగ్‌కు రాలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మొత్తంగా హుజూరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కాగా.. బద్వేల్ లో గతం కంటే కూడా తక్కువ పోలింగే నమోదు కావడం గమనార్హం.