పూజా హెగ్డే దూకుడు మామూలుగా లేదు. ఒక వైపున టాలీవుడ్ నుంచి గెలుపులు .. మరో వైపున కోలీవుడ్ – బాలీవుడ్ నుంచి పిలుపులు అన్నట్టుగా ఉంది ఆమె జోరు. అప్పేడే కోసిన పెసరకాయలా .. అప్పుడే చుట్టిన పూతరేకులా కనిపించే ఈ సుందరి, తన జోరును మరింత పెంచనున్నట్టు తెలుస్తోంది. అదృష్టం అంటే ఇది .. కాలం కలిసి రావడమంటే ఇది అనే విషయాన్ని నిరూపిస్తోంది. స్టార్ డైరెక్టర్లు .. ప్రొడ్యూసర్లు ఆమె డేట్స్ లేవని చెబితేనే, మరో హీరోయిన్ కోసం వెళుతున్నారంటే పరిస్థితుని అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తోంది. స్టార్ హీరోలతో .. వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది. పాన్ ఇండియా మూవీగా ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్‘ సినిమాలో ఆమెనే కథానాయిక. ఈ సినిమా కోసం ఆమె అభిమానులంతా ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇక అఖిల్ జోడీగా ఆమె చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ప్రాజెక్టులకి సంబంధించి ఈ పొడుగుకాళ్ల సుందరి డేట్స్ కోసం ఓ పోరాటమే జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఆమె తమిళస్టార్ హీరో విజయ్ సినిమా చేయడానికి అంగీకరించిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘మాస్టర్’ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్న విజయ్, ఆ తరువాత సినిమాను ‘నెల్సన్ దిలీప్ కుమార్’ దర్శకత్వంలో చేయనున్నాడు. నెల్సన్ పేరు వినగానే నయనతార ప్రధాన పాత్రధారిగా వచ్చిన ‘కోలమావు కోకిల’ సినిమా గుర్తుకు వస్తుంది. ఒక సింపుల్ లైన్ ను ఎంత అద్భుతంగా చెప్పవచ్చనేది ఈ సినిమాతో నెల్సన్ నిరూపించాడు. తన 65వ సినిమాను చేసే ఛాన్సును విజయ్ ఆయనకి ఇచ్చాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఇదే సమయంలో ఆమె సల్మాన్ సరసన నాయికగా ఒక బాలీవుడ్ ప్రాజెక్టుపై కూడా సైన్ చేసిందని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ అందగత్తె అదృష్టాన్ని దత్తత చేసుకుందేమోనని అనిపించడం లేదూ!
Must Read ;- చైతు సరసన పూజా, రష్మిక.. ఏంటా సినిమా?