ఏపీలో 30 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చరిత్రలో నిలిపోవాలని చూస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశలు అంత తొందరగా నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ పథకానికి రూ.7300 కోట్లు ఖర్చు చేశారు. భూముల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మరోవైపు ముంపు భూములు అధిక ధరలకు కొనుగోలు చేశారని, నివాసానికి పనికిరాని భూములు ఇస్తున్నారని వర్షాకాలంలో మునిగిపోయిన భూముల వద్ద దిగిన ఫోటోలతో ప్రతిపక్షపార్టీల నేతలు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హచ్ ఛల్ చేశాయి. లబ్దిదారులకు ఇచ్చిన భూములు వెంటనే అమ్ముకునేలా పట్టాలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లడంతో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడింది.
సుప్రీం తీర్పే కీలకం
ఇళ్ల పట్టాల పంపిణీపై సుప్రీం తీర్పు కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ప్రభుత్వం లబ్దిదారులకు ఉచితంగా ఇచ్చే భూములను అనుభవించాలే కానీ, అమ్ముకునే హక్కు లేదు. అసైన్ మెంట్ భూములు కూడా ఈ పరిధిలోకే వస్తాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వం నుంచి లబ్దిదారులు పొందిన ఇళ్ల స్థలాన్ని అమ్ముకోవచ్చే నిబంధన తీసుకువచ్చింది. దీనిపై టీడీపీ నాయకులు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై స్టే ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ మూడు సార్లు వాయిదా పడింది.
వర్షాకాలం వెళ్లే వరకూ కాలయాపన చేస్తారా?
ప్రభుత్వం కొనుగోలు చేసిన చాలా భూముల్లో వర్షపునీరు నిలిచిపోయింది. కాకినాడ, రాజమండ్రిలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆవ భూముల్లో అయితే 7 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. ఈ రెండు ప్రాంతాల్లోనే రూ.600 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన భూమిలో వరద నీరు చేరడంతో పంపిణీకి పనికి రాకుండా పోయింది. అందుకే వేసవి కాలం వరకూ సాగదీసి, ఆ తరవాత సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును పరిశీలించి ముందుకు సాగాలని చూస్తున్నారు. అప్పటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోర్టులో వేయడం వల్లే ఇళ్లపట్టాల పంపిణీ ఆగిపోయిందని ప్రచారం చేయాలని వైసీపీ వర్గాలను వారి అధిష్టానం ఆదేశించిందని సమాచారం. దీంతో ఇళ్ల పట్టాల రాకపోవడానికి చంద్రబాబే కారణమని ఏ వైసీపీ నేత నోరు తెరిచినా అదే చెబుతున్నారు.
నివాసానికి పనికి వస్తాయా?
ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములు గ్రామాలకు, పట్టణాలకు దూరంగా విసిరేసినట్టు ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లబ్దిదారులు నివాసం ఉండే ప్రాంతం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో భూములు కొనుగోలు చేశారు. ఉదాహరణకు విజయవాడలోనే పరిశీలిస్తే విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామ పరిధిలో ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేశారు. కనీసం అక్కడికి వెళ్లడానికి రోడ్డు సదుపాయం కూడా లేదు. ఇలాంటి ప్రాంతాల్లో సెంటు భూమి ఇస్తే ఎవరైనా ఇళ్లు కట్టుకుంటారా అంటే కష్టమేనని చెప్పవచ్చు. పట్టణాల్లో చిన్నా, చితకా పనులు చేసుకుంటూ జీవిస్తోన్న పేదలు ప్రభుత్వం ఇచ్చే భూమిలో ఇళ్లు కట్టుకుని, అక్కడ నుంచి పనికి వెళ్లాలంటే సాధ్యం కాదు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేయాలని భావిస్తున్న 30 లక్షల ఇళ్ల పట్టాల్లో 10 శాతం మించి పేదలకు ఉపయోగపడవని వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. రూ.7,300 కోట్లు ఖర్చు చేసినా వైసీపీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలా కనిపించడం లేదు. దీనికితోడు ఈ పథకంలో చోటుచేసుకుంటోన్న అవినీతి పార్టీ ప్రతిష్ఠను మంటగలిపేలా ఉంది.