కళ్లముందే ఉ*న్మాది రంపంతో దా*డి చేస్తున్నా భయపడలేదు. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా వెనకడుగు వేయలేదు. అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న లక్ష్మి అనే విద్యార్థిని చూపిన ధైర్యసాహసాలపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రేమను నిరాకరించిందనే కక్షతో పదో తరగతి విద్యార్థిని గోపికపై సమీప బంధువైన హేమంత్ ఎలక్ట్రిక్ రంపంతో దా*డికి దిగిన వేళ, మిగిలిన పిల్లలంతా భయంతో పరుగులు తీస్తే లక్ష్మి మాత్రం ప్రాణాలకు తెగించి స్నేహితురాలికి అడ్డంగా నిలిచింది.
ఉ*న్మాది రంపంతో నర*కడానికి ప్రయత్నించిన సమయంలో లక్ష్మి ఏమాత్రం వెనుకాడకుండా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ పవర్ కట్టర్‌తో ఉన్మాది జరిపిన దా*డిలో లక్ష్మి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఈ బాలిక సమయస్ఫూర్తిని, సాహసాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. లక్ష్మి చూపిన ఈ అసాధారణ ధైర్యానికి గానూ జాతీయ సాహస బాలిక అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమె పేరును సిఫారసు చేసింది.
అయితే, సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఈ బాలిక వెనుక ఓ దీనగాథ ఉంది. లక్ష్మి కుటుంబం కటిక పేదరికంలో మగ్గుతోంది. రోజువారీ కూలీలైన తల్లి రమాదేవి ప్రైవేట్ కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తుండగా, తండ్రి నాగరాజు భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. వీరికి లక్ష్మితో పాటు మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో లక్ష్మి చెల్లెళ్లు ఇద్దరూ పుట్టుకతోనే వికలాంగులు కావడం ఆ కుటుంబాన్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. ఆ దంపతుల కొద్దిపాటి సంపాదన పిల్లల చదువులకు, పోషణకు సరిపోవడం లేదు.
దీనికి తోడు ఇంట్లో ఉన్న 70 ఏళ్ల వృద్ధురాలు (లక్ష్మి నానమ్మ) కాళ్లు పడిపోయి మంచానికే పరిమితమవ్వడంతో ఆమెకు కనీసం మందులు కొనడానికి కూడా డబ్బులు లేక ఆ కుటుంబం రోజూ అవస్థలు పడుతోంది. లక్ష్మి నివాసముంటున్న ఇల్లు కూడా శిథిలావస్థలో ఉండటం వారి పేదరికానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాన్ని కాపాడిన ధైర్యవంతురాలి ఇంట్లో ఇన్ని గుండెకోతలు ఉన్నాయన్న నిజం అందరినీ తీవ్రంగా లచివేస్తోంది.
కేవలం వేదికలపై ప్రశంసలు, షీల్డులు ఇస్తే ఈ కుటుంబ ఆకలి, కష్టాలు తీరవని ప్రజాసంఘాలు, స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఆపదలో ఉన్న స్నేహితురాలి కోసం తెగించిన లక్ష్మికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా బలమైన అండగా నిలవాల్సిన అవసరం ఉంది. వికలాంగులైన లక్ష్మి సోదరీమణులకు తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని, వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే లక్ష్మి ఉన్నత చదువుల ఖర్చులు భరిస్తూ, సీఎం సహాయ నిధి నుంచి తగిన నగదు సాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.











