చీరాలలో నిన్న జరిగిన కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ వర్గాల ఘర్షణపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. రాష్ట్ర స్థాయి నాయకులు ఇద్దరు నేతలకు ఫోన్ చేసి గీత దాటొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. పరిస్థితి అడుపు తప్పితే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని కరణం, అమంచికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సైతం , రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు.
నివురుగప్పిన నిప్పులా చీరాల…!
శనివారం రాత్రి కరణం vs ఆమంచి వర్గాల రాళ్లు, కర్రల దాడులతో రేగిన వివాదంతో చీరాలలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎమ్మెల్యే కరణం బలరాం జన్మదినోత్సవం సందర్భంగా పందిళ్లపల్లిలో వైసీపీ నేత అంజిరెడ్డి ఇంట్లో కరణం వర్గం జన్మదిన వేడుకల ఏర్పాట్లు చేసింది. చీరాల నుంచి పందిళ్లపల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంజిరెడ్డి ఇంటి వద్ద కేకు కత్తిరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై తన నివాసంలో కార్యకర్తలతో సమావేశం పెట్టారు. ఈ సమయంలోనే కరణం వర్గీయులు ఆమంచి ఇంటి ముందుగా వెళ్తుండగా వివాదం చెలరేగింది. ఇరువర్గాలు నినాదాలు చేసుకుంటూ ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. దీనితో ఆమంచి అనుచరులు రోడ్డుపై భైఠాయించి ర్యాలీకి అడ్డంగా నిలబడ్డారు. ర్యాలీ కొనసాగాలని అని బలరాం వర్గం…, మా సొంత ఊరిలో నన్ను రెచ్చగొట్టడానికి ఈ ర్యాలీ పెట్టారని ఆమంచి పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఓ వైపు ఆమంచి, మరోవైపు బలరాం వర్గం, వైసీపీ నాయకులు అమృతపాణి, అంజిరెడ్డి తమ మాటే నెగ్గాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ సమయంలో ఒక్కసారి పరిస్థితి అదుపుతప్పి, ఇరువర్గాలు రాళ్లు, కుర్చీలు విసురుకోగా ఇద్దరికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ర్యాలీని చాకలపాలెం మీదుగా మోటుపల్లి రోడ్డు ద్వారా వేడుక స్థలానికి తరలించారు. ఆమంచిని ఇంట్లోకి పంపారు. పరిస్థితి అదుపులోకి వచ్చినా ఇప్పటికీ చీరాలలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో పోలీస్ బందోబస్తు కొనసాగిస్తున్నారు.
ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం కరణం, ఆమంచి గొడవలకు అడ్డుకట్ట వేయకపోతే, ఈ ఆధిపత్య పోరాటంలో తలలు పగిలే అవకాశం ఉందని చీరాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.