పవర్ స్టార్ అంటేనే హైఓల్టేజీ యాక్షన్. నిన్న సాయంత్రం విడుదలైన భీమ్లానాయక్ ట్రైలర్ఱ చూస్తే పవర్ స్టార్ స్టామినా ఏమిటో మరోసారి రుజువవుతుంది. ‘ఏంటి బాలాజీ స్పీడ్ పెంచు’ అని రానా అంటే ‘ఇది పులులు తిరిగే ప్రాంతమంట బాబూ..’ అని డ్రైవర్ రఘుబాబు అంటే ‘పులి పెగ్గేసుకుందిగానీ స్లోగానే పోనీయ్’ అంటాడు’ రానా. ట్రైలర్ ఇలా ప్రారంభం కాగానే పవర్ స్టార్ అనే మెరుపు ప్రత్యక్షమై ఉరుములాంటి డైలాగ్ వస్తుంది.
‘సర్హద్ భీమ్లానాయక్.. సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్..శ్రీశైలం తహసీల్దారు, హఠకేశ్వరం మండలం, ఆంధ్రప్రదేశ్. నేను ఇవతల ఉంటేనే చట్టం… అవతలకొస్తే కష్టం.. వాడికి’’ అనే పవర్‌ఫుల్ డైలాగ్ దుమ్ము దులిపారు పవన్‌కల్యాణ్.
‘‘కిలోమీటర్ ఊరు. సర్… దాటితే మొత్తం అడవే.. పాయింట్ బ్లాంక్‌లో వాణ్ణి కాల్చి తుప్పల్లో పడదొబ్బితే.. పది రోజులు పడుతుంది శవం దొరకడానికి!’ అనే డైలాగ్ వింటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కలానికి పదును పెట్టినట్టే అనిపించింది. పవన్ నోట డైలాగ్ ఎలా పలికితే బాగుంటుందే అలా డైలాగులు రాసినట్టు అనిపిస్తుంది. ‘నేను ఇవతల ఉంటేనే చట్టం… అవతలకొస్తే కష్టం..’ అని పలికి అక్కడ చిన్న పాజ్ ఇచ్చి ‘వాడికి’ అంటూ మెరుపు మెరిపించారు.
‘‘నాయక్… నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ’’ అని ట్రైలర్ చివరలో రానా చెప్పిన డైలాగ్‌లకు థియేటర్ దద్దరిల్లాల్సిందే.
‘భీమ్లానాయక్ కూ, డేనియల్ శేఖర్ ( రానా) ల మధ్య సాగే సన్నివేశాలు, సంభాషణలు, పోరాట దృశ్యాలు, పాటలు, నేపథ్య సంగీతం దేనికదే ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా సాగి అభిమానుల ఆనందం అంబరాన్ని తాకేలా చేస్తాయి. పవన్ కళ్యాణ్, రానా, నిత్య మీనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, పమ్మి సాయి, రామకృష్ణ లు పోషించిన పాత్రలు పాత్రోచితంగా ట్రైలర్ లో కనిపిస్తాయి.
మలయాళ చిత్రంలో కథను కొద్దిగా మార్చినట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా సముద్ర ఖని పాత్రనే తీసుకుంటే విలన్ లేని లోటును భర్తీ చేయడానికి అన్నట్టు ఈ పాత్ర కనిపించింది. మరో రెండు రోజుల్లో పవర్ స్టార్ తుపాను ముందు ప్రశాంత వాతావరణాన్ని ఆయన అభిమానులు సహించలేకపోతున్నారు. నిన్న ట్రైలర్ తోనే వారిలో పూనకాలు వచ్చేశాయి.
ఈనెల 25 న ప్రపంచ వ్యాప్తంగా భీమ్లానాయక్ విడుదలవుతోంది. 23న ప్రీ రిలీజ్ వేడుకను ఇంతకుముందు నిర్ణయించిన వేదికపైనే నిర్వహించనున్నారు. హైదరాబాద్, యూసుఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. దీనికి తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కె.టి.ఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు. ఈ వేడుకలో చిత్ర బృందం అంతా పాల్గొననుంది.