పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా ‘వకీల్ సాబ్’. తన కీరీర్ లోనే మొట్టమొదటి సారిగా లాయర్ గా నటించిన పవర్ స్టార్.. ఈ సినిమాతో అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇస్తారని నిర్మాతలు నమ్ముతున్నారు. బాలీవుడ్ మూవీ పింక్ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకి దర్శకుడు వేణు శ్రీరామ్. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్త నిర్మాణంలో రూపొందిన వకీల్ సాబ్.. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ .. సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. అందులో భాగంలో నేటి సాయంత్రం 6గంటలకు ‘వకీల్ సాబ్’ సినిమా ట్రైలర్ ను పలు థియేటర్స్ లో విడుదల చేశారు.
నగరంలోని ప్రముఖ వ్యక్తి కొడుకు, అతడి ఫ్రెండ్స్ .. ఓ ముగ్గురమ్మాయిల్ని ఓ కేస్ లో ఇరికిస్తారు. దాంతో తమకు న్యాయం చేయమని వారు కోర్టుకు వెళతారు. దాంతో వారి తరపున వాదించి వారికి న్యాయం చేయడానికి సత్యదేవ్ అనే డిఫెన్స్ లాయర్ బరిలోకి దిగుతాడు. ఇందులో ముగ్గురమ్మాయిలుగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ నటిస్తూండగా.. ప్రకాశ్ రాజ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కనిపిస్తున్నారు. యస్.యస్. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. పవర్ స్టార్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశాయి. కొద్ది సేపటి క్రితమే విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్ .. అతి తక్కువ టైమ్ లోనే యూ ట్యూబ్ ను అత్యధిక వ్యూస్ తో ముంచెత్తుతోంది. పవర్ స్టార్ మాస్ అప్పీల్ అభిమానుల్ని భలేగా ఖుషీ చేస్తోంది. కథానాయికా శ్రుతి హాసన్ నటిస్తోన్న వకీల్ సాబ్ .. ట్రైలర్ ఇంకెన్ని రికార్డుల్ని నెలకొల్పుతుందో చూడాలి.