అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా పులి పులేరా డోంగ్రే – జగత్ జెట్టీలు చిత్రంలో ఎస్వీ రంగారావు నోట పలికిన డైలాగ్ ఇది. కటకటాల రుద్రయ్య సినిమాలో హీరో కృష్ణంరాజు పలికే డైలాగులు కూడా ఆరోజుల్లో అలానే పేలాయి.
అలాంటి కృష్ణంరాజు నట వారసుడిగా సినీ రంగప్రవేశం చేసిన ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరో అవుతాడని 2002లో ఎవరూ ఊహించలేదు.సినిమా సినిమాకీ ప్రభాస్ ప్రభ ఓ రేంజ్ లో వెలిగిపోతోంది. రామానాయుడు స్టూడియోలో ఈశ్వర్ సినిమా ఓపెనింగ్ జరిగినప్పుడు మరో నటవారసుడు వస్తున్నాడు అన్నారంతా. హీరో కృష్ణంరాజు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివకుమారి దంపతుల కుమారుడు ప్రభాస్ స్టూడియోలో అడుగుపెట్టగానే అందరూ అన్న మాట.. ఒక్కడే ‘కుర్రాడు బాగున్నాడు.. మంచి హైటు’. ప్రముఖ నిర్మాత రామానాయుడు మేనల్లుడు అశోక్ కుమార్ నిర్మాతగా ‘ఈశ్వర్’ తెరకెక్కింది.
దర్శకుడు జయంత్ సి. పరాన్జీ. ప్రభాస్ మొహానికి మేకప్ వేసుకున్న వేళావిశేషమో, ఈశ్వరేచ్చో తెలియదుగానీ కృష్ణంరాజు పేరు ప్రఖ్యాతులను మించి ప్రభాస్ వెలిగిపోతున్నాడు. ఈరోజు అక్టోబరు 23 ప్రభాస్ పుట్టిన రోజు. పెదనాన్న కృష్ణంరాజు లేని పుట్టిన రోజు ఇది. కృష్ణంరాజు సంస్మరణ సభను తమ సొంతూరులోనిర్వహించి ప్రజానీకానికి షడ్రశోపేత రాజ విందును ఏర్పాటుచేసిన రాజవైభోగాన్ని చాటారు. ప్రభాస్ ఎప్పుడూ వివాదాలకు దూరమే. మనసున్న మారాజుగా అందరి మన్ననలూ అందుకుంటున్న ప్రభాస్ కెరీర్ ను ఓసారి విశ్లేషిద్దాం.
శంఖంలో పోస్తేనేగానీ తీర్థం కాదంటారు. తన నటనను రాజమౌళి అనే శంఖంలో పోయడంతో అది ప్యాన్ ఇండియా తీర్థంగా మారింది. తొలి సినిమా ఫరవాలేదనిపించినా రెండో రాఘవేంద్ర చూసి అంతా పెదవి విరిచేశారు. ఇద్దరు స్టార్ హీరోల సినిమాల మధ్య విడుదలైన వర్షం మొదటి రోజు టాక్ సరిగా లేకపోయినా ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఛత్రపతితో ఇక చెప్పేదే లేదు.
తొలి ప్యాన్ ఇండియా హీరో
వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఒక్కో హీరోది ఒక్కో ప్రత్యేకత. పౌరాణిక పాత్రల్లో అనితర సాధ్యుడు మహానటుడు ఎన్టీఆర్. సామాజిక చిత్రాల్లో ఏఎన్నార్ ఒక దిగ్గజం. అత్యధిక సినిమాల్లో నటించి తెలుగు తెరకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ. అయిదో హీరో స్థానంలో కృష్ణంరాజు మకుటం లేని మహారాజు. బాక్సాఫీస్ అంకెలకు పరుగులు నేర్పింది మెగాస్టార్ చిరంజీవి. ఇలా..తెలుగు తెర దిగ్గజాల స్ఫూర్తిని, లెగసీనీ కొనసాగిస్తూ మన సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో ప్రభాస్.
తొలిరోజు చినుకులతో ప్రారంభమైన వర్షం పెరిగి పెద్దదై తుపానులా మారింది. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం. అప్పటిదాకా ప్రభాస్ గురించి ఆలోచించని సినీ జనం మరో మంచి హీరో దొరికేశాడు అనుకున్నారు.‘ఛత్రపతి’లోని శివాజీ పాత్ర అతనిలోని మరో స్టార్ ని ఆవిష్కరించింది. దానికి దర్శకుడు రాజమౌళి. అప్పటికి రాజమౌళి మీద కూడా పెద్దగా అంచనాలు లేవు.
‘డార్లింగ్’ సినిమాతో అతను అందరికీ డార్లింగ్ ప్రభాస్ అయ్యాడు. ‘మిస్టర్ పెర్ ఫెక్ట్’తో యువత మనసు కొల్లగొట్టాడు. ‘మిర్చి’ ఘాటుతో వెర్రిక్కించాడు. ‘రాధేశ్యామ్’ దాకా సాగిన అతని 20 సినిమాల ప్రయాణంలో బాహుబలి ఒక చరిత్ర. ఆ ఒక్క సినిమా రెండు భాగాలుగా మారి రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి ప్రభాస్ ను ప్యాన్ఇండియా స్టార్ ని చేసేసింది.
ప్రభాస్ దశ, దిశలను బాహుబలి మార్చేసింది. సాహోలో అంత దమ్ము లేకపోయినా బాలీవుడ్ లో దుమ్ము రేగ్గొట్టింది. ఏ హీరకైనా అన్నీ విజయాలు దక్కవు. రాధేశ్యామ్, ఆదిపురుష్ ఆ కోవలోకే వస్తాయి. అయినా ప్రభాస్ ప్రభా వెలిగిపోతూనే ఉంది. ఇప్పుడంతా సలార్ మేనియా కప్పేసి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వచ్చే డిసెంబరుకు విడుదల కానుంది. ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ నాగ్ అశ్విన్ కల్కి ఉండనే ఉంది. ఈ రెండు సినిమాలతో ప్రభాస్ ప్రభ ఇంకెంత వెలగనుందో చూడాలి. మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ కూడా సెట్స్ మీద ఉంది. టి సిరీస్ నిర్మాణంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించే స్పిరిట్ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
సేవాతత్పరత.. అజాతశత్రువు
ప్రభాస్ కు దేశవ్యాప్తంగానే కాకుండా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, అమెరికా వంటి విదేశాల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించారు. ఈ మ్యూజియంలో వ్యాక్స్ స్ట్యాచ్యూ కలిగిన తొలి సౌత్ స్టార్ ప్రభాస్ కావడం విశేషం. సొసైటీకి తన అవసరం కలిగిన ప్రతిసారీ మనసున్న గొప్ప స్టార్ గా నిరూపించుకుంటారు ప్రభాస్. అతనిలోని సేవాతత్పరతను ప్రశంసించాల్సిందే.
తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు. తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. విరాళాలు ఇవ్వడంలో ప్రభాస్ ది పెద్ద చేయి. మిగతా స్టార్స్ కంటే పెద్ద మొత్తంలో ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వాలకు అందిస్తుంటారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు సంపాదించుకుంటున్న తొలి సౌత్ హీరో అతనే. ఆయన వ్యక్తిత్వం నోబుల్…ఇమేజ్ గ్లోబల్…స్టార్ డమ్ అన్ మ్యాచబుల్. ఈ పుట్టిన రోజు సందర్బంగా ఎన్ని సర్ప్పైజ్ వస్తాయో చూడాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హీరోల కోవలోకి ప్రభాస్ వస్తాడు. అతని ప్రభా మరింత వెలగాలని లియో న్యూస్ శుభాకాంక్షలు అందజేస్తోంది.