ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా ప్రభాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఆయన అంగీకరించిన ‘ఆది పురుష్’ .. ‘సలార్’ సినిమాలను గురించి ముచ్చటించుకుంటున్నారు. ఇతిహాసమైన ‘రామాయణం‘ .. ‘ఆదిపురుష్’ గా సెట్స్ పైకి వెళ్లనుంది. భారీ పౌరాణిక చిత్రం కావడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది. ఇక ‘సలార్’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సినిమా కావడం, మాఫియా నేపథ్యంలో నిర్మితమయ్యే ప్రాజెక్టు కావడం అందుకు ప్రధాన కారణం. అలాంటి ఈ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా ప్రకటించిన ‘సలార్’ సినిమా రెగ్యులర్ షూటింగు జనవరి నుంచి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయనున్నారు. కథానాయికగా ఇప్పటికే ‘దిశా పటాని’ పేరు వినిపిస్తోంది. ఇతర ముఖ్యమైన పాత్రల ఎంపిక దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఆ తరువాత వరుసలోని పాత్రల కోసం కొత్తవాళ్లను తీసుకోనున్నట్టు చెబుతున్నారు. అన్ని వయసులవారు ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చునని అంటున్నారు. ఈ నెల 15వ తేదీన హైదరాబాదులో ఈ ఆడిషన్స్ జరగనున్నాయి. ఎలా? .. ఎక్కడ? అనేది రేపో .. మాపో ఎనౌన్స్ చేయవచ్చునేమో.
నటన పట్ల ఆసక్తి ఉన్నవారు, ఏదో ఒక భాషలో .. ఏదో ఒక అంశాన్ని తీసుకుని నటించి ఒక నిమిషం నిడివి కలిగిన వీడియోను ఈ సినిమా టీమ్ కి అందజేయాలట. త్వరలోనే చెన్నై .. బెంగుళూర్ ప్రాంతాల్లోను ఆడిషన్స్ జరపనున్నట్టు చెబుతున్నారు. ఇంతటి భారీ సినిమా కోసం ఆడిషన్స్ ద్వారా నటీనటులను ఎంచుకోవడం ఆశ్చర్యంగా అనిపించడం సహజమే. ఆసక్తి ఉన్నవారు .. అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునేవారు ఆ దిశగా అడుగు ముందుకువేస్తే మంచిదే. అసలే ప్రభాస్ మూవీ .. ఆపై పాన్ ఇండియా సినిమా .. అందులో నటించే అవకాశం రావడమంటే మాటలా?
Must Read ;- ప్రభాస్.. సలార్ లో ముస్లిం లీడరా..?











