ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ప్రభాస్ తో ఎవరు ఏ సినిమా చేయాలన్నా ఆ కథకి పాన్ ఇండియా స్థాయి లక్షణాలు ఉండాలి. ప్రభాస్ కి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే కథలను తయారు చేస్తున్నారు. ఆయన ఏ తరహా పాత్రలకి బాగుంటాడో చూసుకుని ఆ పాత్రలను డిజైన్ చేస్తున్నారు. ప్రభాస్ కి హడావిడి చేయడం తెలియదు .. ఎంతకాలమైనా కమిట్ మెంట్ తో పనిచేయడమే తెలుసు. ఆయనపై గల నమ్మకంతో భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కించడానికి ఇది కూడా ఒక కారణం. ఆయన సినిమాల బడ్జెట్ ను భరించడానికి తెలుగు .. హిందీ నిర్మాణ సంస్థలు కలిసి రంగంలోకి దిగుతుండటం విశేషం.
అలాంటి ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‘ అనే రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, తదుపరి సినిమా అయిన ‘సలార్’ తో ప్రభాస్ రంగంలోకి దిగుతున్నాడు. ‘కేజీఎఫ్1’ .. ‘కేజీఎఫ్ 2‘ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ ను ఆయన మరింత రఫ్ గా .. రెబల్ గా చూపించనున్నాడు.
నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ గోదావరిఖని బొగ్గుగనుల్లో జరగనుంది. కొన్ని రోజులుగా అక్కడ అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సన్నివేశానికి తగినట్టుగా అక్కడి లొకేషన్లో కొన్ని సెట్లు కూడా వేసి షూటింగు చేయనున్నారు. గోదావరిఖనిలోని ఓపెన్ కాస్ట్ 2లో ప్రభాస్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను వారం రోజుల పాటు చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అసలే ప్రభాస్ సినిమా .. ఆపై పాన్ ఇండియా సినిమా తెలంగాణలో షూటింగు జరుపుకోవడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడి షూటింగు విశేషాలు తెలుసుకోవడానికి మరింత ఆసక్తిని చూపుతున్నారు.
Must Read ;- ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఎప్పుడు.?