‘బాహుబలి’ తరువాత ప్రభాస్ క్రేజ్ సామాజిక మధ్యమాల్లో కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఆయన ఫేస్ బుక్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరగా, ఇన్ స్టా ఖాతాలో 5.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇన్నాళ్లు దక్షిణాదిన సోషల్ మీడియా రికార్డులు, ముఖ్యంగా ట్విట్టర్ రికార్డ్స్ అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అజిత్, విజయ్ మాత్రమే ఉండేవారు. అభిమానులు పవన్, మహేష్ బాబుల పుట్టినరోజునాడు 40 మిలియన్లు, 50 మిలియన్లు, 60 మిలియన్ల ట్వీట్లు అంటూ పనిగట్టుకుని మరీ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటారు. మొన్నా మధ్యన పవన్ పుట్టినరోజుకు ఆయన అభిమానులు ఏకంగా 65 మిలియన్లకు పైగా ట్వీట్లు చేసి భారీ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు.
ఇక ప్రభాస్ సోషల్ మీడియా ఫాలోయింగ్ చూడబోతే ఈ రికార్డులన్నీ బద్దలయ్యేలా ఉన్నాయి. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజున సోషల్ మీడియాలో పెద్ద హడావుడే ఉండనుంది. ఎందుకంటే ప్రభాస్ చేస్తున్న, చేయబోతున్న క్రేజీ సినిమాల అప్డేట్స్ అన్నీ ఆ రోజునే రానున్నాయి. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ప్రభాస్ చిత్రం ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్, అలాగే ‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్ నటీనటుల పూర్తి వివరాలు, నాగ్ అశ్విన్ తో చేయనున్న భారీ బడ్జెట్ సినిమా టైటిల్ అప్డేట్ అన్ని ఆ రోజున రానున్నాయి. అంటే ఆరోజు మొత్తం సామాజిక మాధ్యమాల్లో ప్రభాస్ హడావిడే ఉంటుందన్నమాట. కాబట్టి ఇన్నాళ్లు పవన్, మహేష్ బాబుల పేర్ల మీదున్న ట్విట్టర్ రికార్డులను ప్రభాస్ బ్రేక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.











