ప్రపంచ వ్యాప్తంగా అవతార్ – ది వే ఆఫ్ వాటర్ ఫీవర్ అలుముకుంది. టిక్కెట్ రేటు చూస్తే గుండె గుభేల్ మంటోంది. అయినా హాట్ కేకుల్లా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఓ హాలీవుడ్ సినిమాకు ఇంత క్రేజ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అనుకోవచ్చు. ఈ సినిమాను ఐమాక్స్ 3D, 4DX, 3D ఫార్మట్లలో విడుదల చేస్తున్నారు. అందుకే రేట్లు వాటికి తగ్గట్టుగా ఉన్నాయి. బెంగళూరులో ఐమాక్స్ టికెట్ రేటును రూ.1450 గా నిర్ణయించారు. పుణెలో రూ.1200, హైదరాబాద్ లో రూ.400 -350గా నిర్ణయించారు. వీటికి పన్ను అదనం.
ముస్తాబవుతున్న అతి పెద్ద తెర
అవతార్ 2 ప్రేక్షకులకు అద్భుతమైర అనుభూతిని ఇచ్చేందుకు హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో అతి పెద్ద స్క్రీన్ సిద్ధమవుతోంది. మన దేశంలోనే ఇదే అతిపెద్ద తెర. అవతార్ చూసే ప్రేక్షకులకు కొత్త అనుభూతి తప్పదు. దీని ఎత్తు 64 అడుగులు, వెడల్పు 101.6 అడుగులు. ప్రపంచం మొత్తం మీద చూస్తే ఇదే అతి పొడవైన స్క్రీన్ గా చెప్పాలి. సరికొత్త సినిమా ఎక్స్ పీరియన్స్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ అందించబోతోంది. కెనడాకు చెందిన ప్రొజెక్షన్ స్క్రీన్ ఉత్పత్తిదారు స్ట్రాంగ్ ఎమ్‌డీఐ ఈ తెరను ముస్తాబుచేస్తోంది. దీనికి సంబంధించిన స్పీకర్లు క్యూ.ఎస్.సి. ఆడియో నుంచి వచ్చాయి. ప్లేబ్యాక్ కోసం డాల్బీ సీపీ 950 సౌండ్ ప్రాసెసర్ ను వినియోగిస్తున్నారు. ‘అవతార్ 2’ ఈ నెల 16న విడుదల కాబోతోంది కాబట్టి యుద్దప్రాతిపదికన ఈ తెరను ముస్తాబుచేస్తున్నారు.