(ఉత్తరాంధ్ర లియో న్యూస్ ప్రతినిధి)
‘తన తల్లిదండ్రులను మళ్లీ చూస్తానని అనుకోలేదు’ అని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ అన్నారు.పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన ప్రశాంత్ బుధవారం విశాఖపట్నం చేరుకున్నాడు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.నెల రోజుల్లో తాను పాకిస్తాన్ జైలు నుంచి విడుదలవుతానని అనుకున్నానని,అయితే ఇంత కాలం పట్టిందని ఆయన అన్నారు.
జైలులో ఆధ్యాత్మిక చింతనతో ..
పాకిస్తాన్ జైలులో ఉన్న నాలుగేళ్లు కూడా ఆధ్యాత్మిక చింతనతో గడిపినట్లు ప్రశాంత్ తెలిపారు.పాకిస్తాన్ జైలులో భారతీయులు మరింత మంది ఉన్నారని,వారి విడుదలకు భారత ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. తెలియక కొంత మంది సరిహద్దులు దాటి పాకిస్తాన్ బలగాలకు చిక్కినట్లు ఆయన తెలిపారు.తనలాంటి వాళ్లు చాలా మంది భారతీయులు పాక్ జైళ్లలో ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తున్నారని,అక్కడ నుంచి బయటపడటం చాలా కష్టమని తెలిపారు.విచారణ సమయంలో బాగా కొట్టారని,తాను వెళ్లే మార్గంలోని ఎడారిలో నరకయాతన అనుభవించానని తెలిపారు.సైనికుల ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్లు తినే ఆహారం కడుపు నిండా పెట్టేవారని,రెండున్నరేళ్ల తరువాత కాస్త స్వేచ్ఛ వచ్చినట్టు అనిపించిందని చెప్పారు.సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్,తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నానని తెలిపారు.
అమ్మ వద్దన్నా..
అమ్మ వద్దన్నా తాను వెళ్లానని,పాకిస్తాన్ బలగాలకు పట్టుబడిన తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నానని ఆయన చెప్పారు.పాకిస్తాన్‌లో తనను బాగానే చూశారని ఆయన చెప్పారు.నాలుగేళ్లు పాకిస్తాన్ జైలులో ఉండి ప్రశాంత్ తిరిగి ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఇంజనీరింగ్ చేసిన ప్రశాంత్ ..
విశాఖపట్నంలో ప్రస్తుతం స్థిరపడిన .. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన మైదమ్ బాబూరావు 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి భార్య,కుమారుడు ప్రశాంత్‌తో కలసి కూకట్‌పల్లి భగత్‌సింగ్ నగర్‌లో ఉండేవారు.ఇంజనీరింగ్ చేసిన ప్రశాంత్ .. 2010లో బెంగళూరులో ఉద్యోగం చేశాడు.ఆ సమయంలో అక్కడ మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి స్వప్నిక పాండేతో పరిచయమైంది.ఈ క్రమంలో ప్రశాంత్ ఆమెను ప్రేమించాడు.మూడేళ్లు కలసి పని చేసినా ఆ మాట ఆమెకు చెప్పలేకపోయాడు.2013లో ఉద్యోగ రీత్యా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినా ఆమె వద్దకు వెళ్లాలని ప్రయత్నించాడు.ఈ లోపు యువతి బెంగళూరు నుంచి వెళ్లిపోవడంతో నేరుగా మధ్యప్రదేశ్‌లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రేమ విషయం చెప్పాడు.వారి నుంచి ప్రతికూల సమాధానం రావడంతో ఆ యువతి స్విట్జర్లాండ్‌లో ఉన్నట్టు తెలుసుకొని అక్కడికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
గూగుల్ చూపిన దారిలో..
2017 ఏప్రిల్ 11న కార్యాలయానికి వెళ్తున్నానని తల్లికి చెప్పిన ప్రశాంత్ . స్విట్జర్లాండ్ బయలుదేరాడు.పాకిస్థాన్ మీదుగా వెళ్తే స్విట్జర్లాండ్ 8,400 కి.మీ దూరం వస్తుందని గూగుల్ మ్యాప్‌లో గుర్తించి,రెండు ప్రింట్లు తీసుకొని ఫోను, పర్సు కూడా ఇంట్లోనే వదిలేసి సికింద్రాబాద్ చేరాడు.టిక్కెట్టు లేకుండా రైలు ద్వారా రాజస్థాన్‌లోని బికనీర్ వెళ్లాడు. అక్కడి నుంచి కాలినడకన వెళ్లి ఏప్రిల్ 13న భారత్-పాక్ సరిహద్దులోని రక్షణ కంచె దాటి పాక్‌లోకి ప్రవేశించాడు. అప్పటికే తీవ్రంగా అలసిపోయిన ప్రశాంత్ సమీపంలోని ఓ గుడిసెలో స్పృహ తప్పి పడిపోయాడు.రక్షణ కంచె దాటే క్రమంలో ప్రశాంత్ చొక్కా చిరిగి ఓ పీలిక దానికి చిక్కుకోవడంతో అది గమనించిన పాక్ సరిహద్దు భద్రతా బలగాలు ఏప్రిల్ 14న అదుపులోకి తీసుకున్నాయి.వెంటనే లాహోర్‌లోని సైనిక కేంద్రానికి తరలించాయి.తమదైన శైలిలో అతడి వివరాలు సేకరించి,సాధారణ పౌరుడిగా నిర్ధారించుకొని రెండు-రెండున్నరేళ్ల తరువాత ఆ దేశ చట్టాల ప్రకారం స్థానిక కోర్టులో హాజరుపరిచాయి.కోర్టు ఏడాదిపాటు జైలు శిక్ష విధించడంతో పోలీసులు కోట్ లాక్‌పాట్ జైలుకు తరలించారు.
రెండేళ్లకు ఆచూకీ ..
2017 ఏప్రిల్ 29న తన కుమారుడు అదృశ్యమైనట్టు ప్రశాంత్ తండ్రి బాబూరావు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మరోవైపు సైన్యం అదుపులో ఉన్న సమయంలో ప్రశాంత్ ఆచూకీ ఎవరికీ తెలియలేదు.ఎప్పుడైతే పాక్‌లో సివిల్ కోర్టులో హాజరుపరిచేందుకు బయటికి వచ్చారో.. అప్పుడు మీడియాకు తన వివరాలు వెల్లడించాడు.దాంతో భారత్‌లో ఈ విషయం తెలిసింది.కోర్టుకు వస్తున్న సందర్భంలో వీలు చిక్కినప్పుడు తండ్రికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలిపేవాడు. దీంతో ప్రశాంత్ తల్లిదండ్రులు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలసి తమ కుమారుడిని సురక్షితంగా ఇల్లు చేర్చాలని కోరారు.సజ్జనార్ స్వయంగా దిల్లీ వెళ్లి విషయాన్ని కేంద్ర హోంశాఖకు వివరించడంతో అతన్ని భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రయత్నం ఫలించింది.పాకిస్థాన్ జైలు నుంచి విడుదలైన ఆ యువకుడిని మే 31న పంజాబ్ అట్టారి పోలీస్‌స్టేషన్‌కు చేర్చారు.అక్కడ అతడిని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ పి.రవీంద్రప్రసాద్‌కు అప్పగించారు.మంగళవారం మధ్యాహ్నానికి సురక్షితంగా హైదరాబాద్ చేరారు.రాష్ట్ర, కేంద్ర, హోంమంత్రిత్వ శాఖల చొరవతోనే ప్రశాంత్‌ను సురక్షితంగా తీసుకురాగలిగినట్టు సీపీ సజ్జనార్ తెలిపారు.ప్రశాంత్‌ను అతడి సోదరుడు శ్రీకాంత్‌కు అప్పగించారు.వారిని విశాఖపట్నం పంపేందుకు ఏర్పాట్లు చేశారు.ఆ విధంగా ప్రశాంత్ నాలుగేళ్ల తర్వాత బుధవారం సొంత గూటికి చేరుకున్నారు.