ఏపీ సీఎంవోలో కీలక అధికారుల బదిలీకి రంగం సిద్దమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కేంద్ర సర్వీసులకు వెళ్లడం దాదాపు ఖరారైంది. గతంలో కూడా ప్రవీణ్ ప్రకాష్ కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. తాజాగా కేంద్ర సర్వీసుల్లో పనిచేసే అవకాశం వచ్చిందని, అనుమతించాలని ప్రవీణ్ ప్రకాష్, సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరినట్టు సమాచారం. ఆయన కూడా దీనిపై సానుకూలంగా స్పందించారట. ప్రవీణ్ ప్రకాష్ బదిలీపై వెళితే ఆ స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ రావత్ ను ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా నియమించనున్నారని తెలుస్తోంది.
ది లియోన్యూస్ డాట్ కామ్ ఈ విషయాన్ని రెండు రోజుల కిందటే పాఠకులకు అందించింది. సీఎంఓలో కీలక అధికారుల బదిలీ శీర్షికతో అందించిన కథనంలో.. ఈవివరాలు ఉన్నాయి. అంతా ఆ కథనంలో పేర్కొన్న ప్రకారమే జరుగుతోంది.
కేసుల్లో ఇరుక్కుంటామని భయమా?
ఏపీ సీఎంఓలో ప్రవీణ్ ప్రకాష్ అంతా తానై వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీష్ ప్రకాష్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. అయితే అకస్మాత్తుగా కేంద్ర సర్వీసుల్లో అవకాశం వచ్చిందంటూ, తనను రిలీవ్ చేయాలని సీఎంను కోరడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తీసుకుంటోన్న అనేక వివాదాస్పద నిర్ణయాలు భవిష్యత్తులో ఎటు దారితీస్తాయో అంతపట్టకుండా ఉంది.
కోర్టుల తీర్పులను కూడా తప్పుపడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తికే లేఖ రాయడంపై వివాదం నడుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇవి తనకు చుట్టుకుంటే భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే ముందు జాగ్రత్తతో ప్రవీష్ ప్రకాష్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ను రిలీవ్ చేసేందుకు సీఎం కూడా సుముఖత వ్యక్తం చేయడంతో ఇక ఆయన బదిలీ లాంఛనమేనని తెలుస్తోంది.
Also Read ;- ‘ఎప్పటికైనా వీళ్లు డేంజరే.. రెడ్డీస్ అనేవాడు’
Also Read ;- జగనన్న చేతులు కలిపినా, కలవని మనుషులు











