బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతూనే ఉంది. కాగా , వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అటు బాలయ్య అభిమానులతో పాటు, సినీ అభిమాణుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కామెడీ ట్రాక్ చిత్రాలతో వరుస హిట్స్ కొడుతూ మంచి ఫామ్ లో ఉన్న అనిల్.. బాలకృష్ణ ను ఎలా డైరెక్ట్ చేయబోతున్నాడు అనే అంశం కూడా చాలా ఆసక్తిని పెంచింది. ఇక ఇటీవల మూవీలో బాలకృష్ణ క్యారెక్టర్ గురించి చిన్న లీక్స్ ఇవ్వడంతో సినిమా పై అభిమానుల్లో మరింత ఆతృత కనిపిస్తోంది.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణ 50 ఏళ్ల వయసుగల తండ్రి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన కూతురు పాత్రలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల నటించనుందని సమాచారం.అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన కథానాయికగా తొలత మెహ్రీన్ నటించబోతోందనే వార్తలు వినిపించాయి. ఇప్పటికే అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ .. ‘రాజా ది గ్రేట్’ .. ‘ ఎఫ్ 3’ సినిమాలలో మెహ్రీన్ చేయడం వలన, ఈ సినిమాలోనూ మెహ్రీన్ ను తీసుకుంటున్నారనే ప్రచారం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జోరుగా సాగాయి. కానీ ఈ సినిమాకు సంబందించి తాజాగా మరో వార్తా తెరపైకి వస్తోంది. ఈ మూవీలో బాలయ్య సరసన నటించే అవకాశాన్ని ప్రియమణి కొట్టేసింది అనేది ఆ వార్త సారాంశం.
ముఖ్యంగా కథ పరంగా బాలయ్య వయసుకి తగిన నాయికను తీసుకోవాలని ఆలోచించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఎట్టకేలకు ప్రియమణిని ఓకే చేశారని టాక్. తన తాజా చిత్రం అయిన ‘నారప్ప’ సినిమాలో ప్రియమణి నటన కూడా ఈ సినిమాలోకి ఆమెను తీసుకోవడానికి కారణమైందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయనీ, బాలయ్యను ఇంతవరకూ ఎవరూ చూపించని విధంగా తాను చూపిస్తానని అనిల్ రావిపూడి చెప్పడంతో మూవీ పై అందరిలో మరింత ఆసక్తి రేకెత్తుతోంది .