Priyanka Gandhi Era Starts In Congress :
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో మొన్నటిదాకా ఓ స్తబ్దత చాలా స్పష్టంగా కనిపించేది. పార్టీకి సంబంధించి ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలనుకున్నా చాలా సమయమే పట్టేది. అనారోగ్యం వేధిస్తున్నా.. సోనియా గాంధీ కదిలితే తప్పించి ఆయా నిర్ణయాలు ఫైనల్ అయ్యేవి కావు. అయితే ఇటీవలి కాలంలో ఆ తరహా పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా రేవంత్ రెడ్డి, పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా నానా పటోలేల ఎంపిక సమయంలో పార్టీలో స్తబ్దత అన్న మాటే కనిపించలేదు. స్తబ్దత స్థానంలో పనికి రాకుంటే సీనియర్లను కూడా పక్కనపెట్టేస్తాం అన్న దూకుడు అధిష్ఠానంలో కనిపించిందని చెప్పాలి. ఇటు రేవంత్ ఎంపికలో అయినా, అటు సిద్ధూ, పటోలే ఎంపికలో అయినా అధిష్ఠానం.. ఆయా రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా పెద్దగా లెక్క చేయలేదనే చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడు గోల చేస్తున్నారు.. మరి ఇన్నాళ్లు పార్టీ కృశించిపోతుంటే ఏం చేశారన్న చందంగా వారి వైపు చురచురా చూసిన అధిష్ఠానం.. మా ఎంపిక ఇదే.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్న చందంగా వ్యవహరించిన వైనం చాలా స్పష్టంగానే కనిపించింది. ఈ మార్పు వెనుక ప్రియాంకా గాంధీ పాత్ర ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెరసి పార్టీలో ప్రియాంకా శకం మొదలైపోయినట్టేనన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ప్రియాంక ఎంట్రీపై పార్టీ వర్గాల ధీమా
పార్టీ అధినేత్రిగా సుధీర్ఘ కాలం పాటు కొనసాగిన సోనియా గాంధీ గానీ, కొన్నాళ్లకే కాడి కింద పడేసిన రాహుల్ గాంధీలు గానీ.. ఈ తరహాలో సీనియర్లను పక్కనపెట్టి దూకుడు కలిగిన యువ నేతలను ఎంపిక చేయడం దుస్సాధ్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో వారిద్దరి హాయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను బేరీజు వేస్తున్న పార్టీ శ్రేణులు..కొత్త నిర్ణయాలు కొత్త తరం నేత నుంచే వచ్చి ఉంటాయని కూడా ఆ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అంతేకాకుండా తాము ఎంత కాలంగానో వేచి చూస్తున్న సమయం వచ్చేసిందని, ఇక పార్టీ అంచెలంచెలుగా ఎదగడం ఖాయమని, త్వరలోనే కేంద్రంలో పార్టీకి అధికారం ఖాయమన్న ధీమా కూడా పార్టీ శ్రేణుల్లో చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా మీనమేషాలు లెక్కించడం వల్లే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగలేక నానా అవస్థలు పడిందని, ఇకపై అలాంటి పరిస్థితి రాబోదన్న భావన కూడా వారిలో వ్యక్తమవుతోంది. సమీప భవిష్యత్తులో ప్రియాంక నుంచి మరిన్ని కీలక నిర్ణయాలు రానున్నాయని.. ఆ నిర్ణయాలతో జాతీయ స్థాయిలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీలో దూకుడు పెరుగుతుందని వారు విశ్వసిస్తున్నారు.
రేవంత్, సిద్ధూ ఎంపికలే నిదర్శనం
టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో చాలా జాప్యమే జరిగింది. ఓ వైపు రేవంత్ రెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇంకోవైపు జగ్గారెడ్డి, ఆ వెనుక సీనియర్ నేత వి.హన్మంతరావు.. ఇలా ఎవరికి వారే పీసీసీ చీఫ్ కోసం యత్నించారు. అయితే ఈ యత్నాలన్నింటినీ ఓ కంట కనిపెట్టిన ప్రియాంక.. నేరుగా రంగంలోకి దిగి ఈ నలుగురు నేతలతో పాటు వీరి కంటే మెరుగైన నేత ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో ఆలోచించారట. అయితే కేసీఆర్ మార్కు బెదిరింపులకు ఎదురొడ్డి నిలబడే సత్తా ఒక్క రేవంత్ కే ఉందన్న విషయాన్ని పసిగట్టిన ప్రియాంక.. తల్లి, సోదరుడితో మంతనాలు సాగించారట. పార్టీకి ఓ రేంజిలో ఊపు రావాలంటే.. రేవంత్ మాదిరి దూకుడు కలిగిన నేత అయితేనే బాగుంటుందని, ఈ విషయంలో సీనియర్ల బెదిరింపులను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని తేల్చేశారట. అంతేకాకుండా సీనియర్లకు పదవులు దక్కకున్నా.. వారు చేసేదేమీ లేదని, ఇప్పటిదాకా వారు చేసిందేమీ కూడా లేదని ప్రియాంక లెక్కలేసి మరీ చెప్పారట. దీంతో ఆమె నిశిత పరిశీలన కరెక్టేనన్న భావనకు వచ్చిన సోనియా, రాహుల్ లు రేవంత్ కే పీసీసీ పీఠం కట్టబెట్టారట. రేవంత్ కు పదవి ఇచ్చిన తర్వాత తెలంగాణలో పార్టీలో ఎంత జోష్ వచ్చిందో చూసిన రాహుల్, సోనియాలు.. పంజాబ్ ఎంపికను కూడా ప్రియాంకకే అప్పగించారట. అక్కడ కూడా ప్రత్యర్థులను ఢీకొట్టాలంటే.. సీఎం అమరీందర్ సింగ్ వంటి సౌమ్యులు పనికి రారని, సిద్ధూ లాంటి డూకుడు కలిగిన నేతే కరెక్టని ప్రియాంక తేల్చారట. ఈ కారణంగానే సీఎం హోదాలో ఉన్న అమరీందర్ వద్దని మొత్తుకున్నా.. పార్టీ అధిష్ఠానం సిద్ధూకే పగ్గాలు అప్పగించింది. ఇదే బాటలో త్వరలోనే మరిన్ని రాష్ట్రాలకు పీసీసీ చీఫ్ లు మారనున్నారని, ఆ ఎంపికలన్నీ కూడా ప్రియాంక మార్గదర్శకత్వంలోనే జరగనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే.. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ప్రియాంక శకం మొదలైపోయిందన్న మాట.