సినిమా రంగంలో అందరికీ తలలో నాలుక ఎవరంటే బీఏ రాజు పేరే వినిపిస్తుంది. అలాంటి బీఏ రాజు ఆకస్మిక మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. ఆయన చిత్ర రంగ ప్రవేశమే తమాషాగా జరిగింది. సూపర్ కృష్ణ అభిమానిగా ఆయనకు ఉత్తరాలు రాస్తూ ఆయనకు దగ్గరయ్యారు రాజు. ఆయన స్వస్థలం విజయవాడ. అలా జర్నలిస్టు, పీర్వోగా, నిర్మాతగా ఎదిగారు. ఆయన సతీమణి జర్నలిస్టు, దర్శకురాలు కలిదిండి జయ రెండేళ్ల క్రితం కన్నుమూశారు.
రాజుకు ఇద్దరు కుమారులు. అరుణ్ కుమార్ ఉద్యోగ రంగంలో స్థిరపడగా, శివకుమార్ దర్శకుడిగా ఓ సినిమా చేశారు. ఆ సినిమా విడుదల కావలసి ఉంది. సినిమా రంగంలో ఎలాంటి సమాచారం కావాలన్నా ఇట్టే చెప్పగలిగే సత్తా బీఏ రాజులో ఉంటుంది. ముఖ్యంగా సినిమా కలెక్షన్లను అంచనా వేసే విషయంలో ఆయన ప్రత్యేకతే వేరు. సూపర్ హిట్ పత్రికను స్థాపించి ఇటు సినిమా రంగానికీ, అటు అభిమానులకూ వారధిగా ఉండేవారు.
హీరో కృష్ణ అభిమానిగా ఆయనకు దగ్గరయ్యారు. ఆయనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి రాజు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ , యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లతో బి ఏ రాజుకు సొంత కుటుంబ సభ్యుడిలా అనుబంధం ఉంది. ‘కృష్ణ గారి సినిమాలకు పని చేశాను, ప్రస్తుతం మహేష్ సినిమాలకు వర్క్ చేస్తున్నాను, రేపు గౌతమ్ కృష్ణ హీరోగా చేసే సినిమాలకు కూడా నేనే పీఆర్వోగా చేస్తాను’ అంటుండేవారాయన.
నాలుగు దశాబ్దాలుగా..
ఇక సినీ పాత్రికేయ కుటుంబంలో బీఏరాజుకువిశిష్ట స్థానం ఉంది. సినీ పాత్రికేయులు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండి సహకారం అందించేవారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో చిత్ర పరిశ్రమకు అత్యంత ఆప్తుడు. సినిమాల జయాపజయాల విషయంలో రాజు అంచనాలు, విశ్లేషణ చాలా కచ్చితంగా ఉంటుందన్న నమ్మకం పరిశ్రమ వర్గాల్లో ఉంది. అలాగే ఏ సినిమాను ఎప్పుడు ఏ దర్శకుడు ఏ హీరోతో నిర్మించాడు.. ఆ బ్యానర్ ఏమిటి… రిలీజ్ డేట్ ఏమిటి… అది ఏ ఏ సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది లాంటి వివరాలను, విశేషాలను ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగిన ఏకైక వ్యక్తి.
కృష్ణ పోద్డలంతోనే..
సూపర్ స్టార్ కృష్ణ ప్రోద్బలంతోనే రాజు జర్నలిస్టుగా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడిగా వివిధ హోదాలలో పని చేశారు. 1994లో తన భార్య జయ. బి (కలిదిండి జయ) సహచర్యంతో సూపర్ హిట్ పధ్రజ్యోతిత్రికను ప్రారంభించి ఫిలిం జర్నలిజంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. కేవలం జర్నలిస్ట్ గానే కాకుండా ఎందరెందరో అగ్రశ్రేణి సినీ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్ కు, సాంకేతిక నిపుణులకు పీఆర్వోగా పని చేశారు. అలాగే వెయ్యి చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇన్చార్జిగా పనిచేసిన బి.ఏ. రాజు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించేవారు.
చిత్ర పరిశ్రమలో పెద్దా చిన్నా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరుచుకున్న రాజు నిర్మాతగా మారి తన సతీమణి జయ.బి దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణి, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ లకు సినీ రంగంతో సంబంధాలున్నాయి. అరుణ్ కుమార్ హాలీవుడ్ చిత్రాలకు సంబందించిన వి ఎఫ్ ఎక్స్ నిపుణుడు.
శివ కుమార్ పూరి జగన్నాధ్, వి వి వినాయక్, మారుతీ, వంటి ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం గడించి ’22’ అనే చిత్రం తో దర్శకుడయ్యాడు. ఆ చిత్రం కరోనా కారణంగా విడుదల ఆగింది. బి ఏ రాజు అనూహ్య మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. రాజు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తూ ఆయన ఆత్మ శాంతిని కోరుకుంటూ పంపుతున్న సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
Must Read ;- నిర్మాత స్రవంతి రవికిశోర్ కు పితృవియోగం