చేతిలో ఓ సెల్ ఉంటే మన మాటలు కోటలు దాటుతాయా… ఇంకేమైనా దాటుతాయా? మీకేమైనా తెలుసా? తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీ సెల్లేమీ పోదులెండి.
ఇటు రిక్షా వాడే కాదు… అటు లక్షాధికారి కూడా స్మార్ట్ గా ఫోన్ తో తయారై ట్రింగు రంగా అంటూ బయలుదేరడమే. ‘ఎటో వెళ్లిపోయింది మనసు.. ఇలా ఒంటరయ్యింది వయసు’ అని పాడుకోడానికి కూడా వీలు లేకుండా సెల్ ఫోన్ మన జీవితాలను ఆక్రమించేసింది. ఒకప్పుడు ప్రేమ లేఖల్ని దాచుకుని వాటితో బెదిరించేవారు. ‘ప్రేమలేఖలు’ పేరుతో సినిమాలు కూడా వచ్చేశాయి. ఆ ప్రేమలేఖలకు ప్రత్యామ్నాయమే ఇప్పుడు కాల్ రికార్డింగులు, ఛాటింగులు… ఇంకా మరెన్నో. మీ ‘స్టేటస్’లు చూసుకుని మీరు మురిసి పోవద్దు సుమా.
మన జాతకాలు తాళ పత్రాల్లో కాదు ఉండేది…
మన జాతకం మన చేతుల్లోనే ఉంది. మన సెల్ ఎవరైనా చూస్తే మన జాతకం ఏమిటో ఇట్టే చెప్పేయొచ్చు. మానవ సంబంధాలు, ఆరోగ్య సంబంధాలు, ఆర్థిక సంబంధాలు.. అన్నీ ఒక్క సెల్ ఫోన్ తోనే ముడిపడి ఉన్నాయి. మొగుడూ పెళ్లాల మధ్య దూరం పెరిగిపోయింది.. పిల్లలకూ తల్లదండ్రులకూ ఎడబాటు పెరిగింది.. కారణం ఒకే ఒక్కటి సెల్ ఫోన్. సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి స్నేహాలు కలిగినా వారిద్దరినీ కలపగలిగే ఒకే ఒక్క నేస్తం సెల్ ఫోన్. కాబట్టి ఆ ప్రేమతరంగాలు కూడా అందులోనే పదిలం సుమా. ‘ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో..’ అని పాటలు పాడుకోవడానికి ఇది సత్తకాలపు యుగమేమీ కాదు… తేడా వస్తే ‘మేమున్నాం’ అంటూ పోలీసులు మీ ముందే ప్రత్యక్షమవుతారు.
ఈ గుణపాఠాలు నేర్చుకుంటే మంచిదేమో?
ఆ మధ్య సినీ నటుడు పృధ్వీని ఇబ్బంది పెట్టింది ఈ కాల్ రికార్డింగేనన్న విషయాన్ని మరువరాదు. ఆయన పదవే కాదు… పరువును కూడా అది బజారున పెట్టింది. ఆ వాయిస్ నాది కాదని ఆయన మొత్తుకున్నా ఫలితం ఎలా ఉందో తెలుసు. ఇక ఈ మధ్యే యాంకర్ కమ్ హీరో ప్రదీప్ పరిస్థితి కూడా అంతే. రామ రామ నాకే పాపం తెలియదు అనుకోడానికి కూడా ఏమీ ఉండదు. ఎక్కడో ముంబయిలో హీరో సుశాంత్, రియాల వరకూ మనం వెళ్లాల్సిన పనిలేదు. టీవీ ఆర్టిస్టు శ్రావణి ఆత్మహత్య కేసులో ఎన్ని కాల్ రికార్డింగులు బయటికి వచ్చాయో మనకు తెలుసు. మన కాల్ రికార్డు చేస్తున్నారని తెలిస్తే మనం మాత్రం మనుసు విప్పి ఎలా మాట్లాడగలం. తేడా వస్తేనే ఇలాంటి రికార్డింగులన్నీ బయటికి వస్తుంటాయి.
పైగా ఏ కాల్ ఎవరు వింటున్నారో తెలియదు. అవతల కాల్ లో ఒకరున్నారో, ఇద్దరున్నారో, ఇంకా ఎక్కువమంది ఉన్నారో తెలియదు. శ్రావణి కేసులో కూడా నిర్మాత అశోక్ రెడ్డిని మాట్లాడకుండా ఉంచి శ్రావణి వేరే వారితో మాట్లాడటాన్ని చూశాం. శ్రావణి కేసులో నిర్మాత అశోక్ రెడ్డి చెబుతున్న దేమిటంటే తనకు అనుకూలంగా ఉన్న రికార్డింగులనే దేవరాజ్ పోలీసులకు ఇచ్చాడని. తన దగ్గర రికార్డింగులు లేకపోవడం అశోక్ రెడ్డి దురదృష్టమేమో. అయినా పోలీసులకు వాటిని సంపాదించడం ఏమంత కష్టం కాదు. దీన్నిబట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే మనం కూడా కాల్ రికార్డింగులు చేసుకుని జాగ్తత్తగా ఉండాలి లేదా పనికిమాలిన విషయాలు పోన్లో మాట్లాడకూడదు. అమ్మాయి ఫోన్ చేసింది కదా అన్ని సొల్లు కార్చుకుంటే చివరికి సెల్ ఊచలే లెక్కించాలి.
ఆ యాప్ లు చాలు మీ గ్యాప్ పెరగడానికి
మీ మనసులో ఉన్న విషయాన్ని బయటికి లాగే టెక్నాలజీ ఇంకా రాలేదు.. దాన్ని అలాగే ఉంచితే మంచిది. అది బయటికి వస్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది. దీనికి కొన్ని యాప్ లు కూడా తోడవుతున్నాయి. మీ పక్కింటి అమ్మాయితో ఛాటింగ్ చేసుకోండి ఇలా అంటూ యూ ట్యూబ్ లో థంబ్ నెయిల్ చూడగానే మీరు టెంప్ట్ అవుతారు. టాస్కర్ అనే యాప్ తో ఏ వ్యక్తి ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. అతను లేదా ఆమె దూరంగా ఉన్నారని తెలుసుకుని అక్రమ సంబంధాలు కొనసాగిస్తే ఏమవుతుందో ఆ తర్వాత తెలుస్తుంది.
సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ఇదివరకటిలా లేదు. మరికొన్ని యాప్ లు ఉన్నాయి. మన గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనైనా మాట్లాడితే మనం లైవ్ లోనే వినవచ్చట. ఆటో రికార్డింగు ఆప్షన్స్, స్క్రీన్ రికార్డింగు ఆప్షన్స్ .. అబ్బో బోలెడు వచ్చేశాయి. మీ ఆలోచనా తరంగాలను పసిగట్టే యాప్ లు, ఫోన్ లు రాలేదు కాబట్టి అప్పటిదాకా ఎలాంటి ఇబ్బందీ లేదు. కాబట్టి ‘మౌనమే నీ భాష ఓ మూగమనసా’ అని పాడుకోవడమే ఉత్తమం.
– పామర్తి హేమసుందర్











