తెలుగు తెరపై సీనియర్ నరేశ్ .. రాజేంద్రప్రసాద్ తరువాత హాస్యకథానాయకుడిగా ‘అల్లరి’ నరేశ్ తన జోరు చూపించాడు. హాస్యరస పోషణలో తనదైన మార్కు వేశాడు. ‘అల్లరి’ నరేశ్ లో మంచి ఈజ్ కనిపిస్తుంది. నవరసాల్లో చాలా కష్టమైనదిగా చెప్పుకునే హాస్యరసాన్ని ఆయన ఆడుతూ పాడుతూ చేసేస్తాడు. అందువల్లనే ఆయన చాలా వేగంగా 50 సినిమాలను పూర్తి చేసేసి .. 60వ నెంబర్ కి దగ్గరలో ఉన్నాడు. అలాంటి ‘అల్లరి’ నరేశ్ హీరోగా త్వరలో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకటి ‘నాంది’ అయితే .. మరొకటి ‘బంగారు బుల్లోడు.
ఈ రెండు సినిమాల్లో ముందుగా ‘బంగారు బుల్లోడు’ సినిమా థియేటర్లకు రానుంది. పీవీ గిరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు. వినోదభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్ జోడీగా పూజా జవేరి నటించింది. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మాయి సుపరిచితమే. ‘భమ్ బోలేనాథ్’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ అమ్మాయి, ‘రైట్ రైట్’ .. ‘ద్వారక’ సినిమాల్లోను నటించింది. అయితే ఆ సినిమాలు అంతగా ఆడకపోవడం వలన, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు మాత్రం దక్కలేదు.
ఇక సోలో హీరోగా ‘అల్లరి’ నరేశ్ కి కూడా హిట్ పడక చాలాకాలమే అయింది. సరైన హిట్ కోసం ఆయన కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. మనసారా నవ్వేసి చాలాకాలమే కావడంతో అభిమానులు కూడా ఆయన నుంచి ఓ మంచి సినిమాను ఆశిస్తున్నారు. ఆసక్తికరమైన కథాకథనాలకు కామెడీ పాళ్లను కలుపుకుని ఆయన రంగంలోకి దిగుతున్నాడు. ‘బంగారు బుల్లోడు’ సినిమాకి సంబంధించిన పోస్టర్లలో ఆయన చాలా జోష్ తో .. ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ ఏడాది తన నుంచి హిట్ తప్పించుకోలేదని చెబుతూనే ఉన్నాడు. చూడాలి మరి ఈ ‘బంగారు బుల్లోడు’ గోల్డెన్ హిట్ ఇస్తాడేమో!











